గత పాతికేళ్లలో తమిళం నుంచి వచ్చిన ఉత్తమ దర్శకుల్లో సెల్వ రాఘనవ్ పేరు తప్పకుండా ఉంటుంది. తన తమ్ముడు ధనుష్‌ను హీరోగా పెట్టి అతను తీసిన కాదల్ కొండేన్ అప్పట్లో తమిళనాట సంచలనం రేపింది. ఇక 7-జి బృందావన కాలనీ సినిమా అటు తమిళంలోనే కాక ఇటు తెలుగులోనూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇవే కాక ఆయురత్తిల్ ఒరువన్ (యుగానికి ఒక్కడు), పుదుపేట (ధూల్ పేట), ఆడువారి మాటలకు అర్థాలే వేరులే లాంటి క్లాసిక్స్ అతడి ఖాతాలో ఉన్నాయి.
కానీ గత దశాబ్ద కాలంగా సెల్వ రాఘవన్ స్థాయికి తగ్గ సినిమాలు తీయట్లేదు. అసలతను దర్శకుడిగా సినిమాలే బాగా తగ్గించేశాడు. నటుడిగా కొంచెం బిజీ అయ్యాడు. ప్రస్తుతం సెల్వ 7-జి బృందావన కాలనీ సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది కాక అతను రెండు క్రేజీ సీక్వెల్స్‌కు రంగం సిద్ధం చేస్తున్నాడు. అవే.. ఆయురత్తిల్ ఒరువన్-2, పుదుపేట్ట-2.
ఈ రెండు చిత్రాల కోసం కొన్నేళ్ల నుంచి బ్యాగ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు సెల్వ రాఘవన్. ఒక టైంలో ఆయురత్తిల్ ఒరువన్ సీక్వెల్‌ను ధనుష్ హీరోగా అనౌన్స్ చేశాడు. కానీ అది ధనుష్ హీరోగా ఆయన తీసిన వేరే సినిమాను ప్రమోట్ చేసుకోవడానికే అని తర్వాత తేలింది. కార్తితోనే ఆ సీక్వెల్ తీస్తే బాగుంటుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. మరోవైపు ధనుష్ హీరోగా పుదుపేట్ట-2 కోసం ప్రయత్నాలు జరిగాయి. కానీ సెల్వ తన పాటికి తాను ఆ స్క్రిప్టులు రెడీ చేస్తున్నాడు కానీ.. ఆ హీరోలిద్దరూ ఈ సినిమాలు చేసే సంకేతాలు కనిపించడం లేదు.
చివరికి స్వయంగా సెల్వనే ఈ సీక్వెల్స్ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చేశాడు. తాను ఆ రెండు చిత్రాలకు స్క్రిప్టులు రెడీ చేస్తున్నానని.. కొన్నేళ్లుగా వర్క్ జరుగుతోందని.. కానీ కార్తి, ధనుష్ ప్రస్తుతం తమ కమిట్మెంట్లతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాలను వేరే హీరోలతో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పాడు సెల్వ. ఐతే తాము ఖాళీగా లేకపోవడం కంటే సెల్వ ఫామ్ దెబ్బ తినడం వల్లే కార్తి, ధనుష్ అతడితో సినిమాలు చేయడానికి ముందుకు రాలేకపోతుండొచ్చనే చర్చ జరుగుతోంది. మరి ఈ క్రేజీ సీక్వెల్స్ ఎప్పుడు, ఎవరితో ముందుకు కదులుతుందో చూడాలి.