హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఘట్టం తెరమీదికి వచ్చిన విషయం తెలిసిందే. మరో రెండురోజుల్లోనే నామినేషన్ల ప్రక్రియ(ఈ నెల 13) ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలైన బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. బీఆర్ ఎస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత బరిలో నిలిచారు. ఇక, కాంగ్రెస్ తరఫున యువ నేత నవీన్ యాదవ్‌కు టికెట్ ఖరారు చేశారు.
ఇక, మరో కీలక పార్టీ బీజేపీ ఈ విషయంలో ఇప్పటి వరకు తేల్చలేక పోయింది. పార్టీ వర్గాల అంచనా ప్రకారం.. ఈ ఎంపికకు మరో రెండు రోజులు సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి బీజేపీ తరఫున ముగ్గురి పేర్లతో కూడిన నివేదికను పార్టీ రాష్ట్ర చీఫ్ రామచందర్‌రావు అధిష్టానానికి పంపించారు. వీరిలో గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమైన.. లంకల దీపక్ రెడ్డి, వీరపనేని పద్మ, జూటూరు కీర్తి రెడ్డిలలో ఒకరిని ఎంపిక చేయాలని ఆయన సూచించారు.
అయితే.. వారం రోజులు గడిచినా.. ఇప్పటి వరకు పార్టీ అధిష్టానం అభ్యర్థి ఎంపికపై దృష్టి పెట్టలేదు. మరోవైపు.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎక్కువగా ఆరాష్ట్రంపైనే ఫోకస్ చేస్తున్నట్టు సమాచారం. అయితే.. తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల్లో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ.. దానికి తగిన విధంగానే అంచనాలు వేస్తోందని.. కాబట్టి బలమైన అభ్యర్థికే అవకాశం దక్కుతుందని అంటున్నారు. కానీ.. నామినేషన్ల సమయం ముంచుకువచ్చిన నేపథ్యంలో పార్టీ ఎవరిని ఖరారు చేస్తుందన్నది ఇంకా టెన్షన్‌గానే ఉంది.
ఎవరికి చాన్స్?
పార్టీ అధిష్టానానికి పంపిన జాబితాలో లంకలపల్లి దీపక్ రెడ్డికి ఎక్కువ అవకాశం లభించేందుకు సానుకూల పరిణామాలు ఉన్నాయన్న చర్చ సాగుతోంది. పార్టీ కీలక నేత, ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో దీపక్ రెడ్డికి అవకాశం ఇచ్చేందుకు అధిష్టానం ప్రయత్నించ వచ్చని అంటున్నారు. అయితే.. బీఆర్ ఎస్ పార్టీ మహిళా అభ్యర్థికి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో.. బీజేపీ కూడా.. ఆ దిశగా దృష్టి పెడితే.. కీర్తి రెడ్డికి అవకాశం చిక్కుతుందన్న చర్చ కూడా జరుగుతోంది. ఏదేమైనా.. మరో రెండు రోజులే గడువు ఉండడం.. పార్టీ తరఫున ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకపోవడం.. స్థానిక నాయకుల్లో చర్చగానేమారింది.