మాస్ సినిమాల వరకు దేశం మొత్తం మీద టాలీవుడ్ చూపించినంత ప్రభావం ఇంకే భాషా పరిశ్రమ చేయలేకపోయిందనేది వాస్తవం. ఎన్టీఆర్ అడవి రాముడుతో మొదలుపెట్టి అల్లు అర్జున్ పుష్ప దాకా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల ఉదాహరణలు కనిపిస్తాయి. ఘరానా మొగుడు టైంలో బిగ్గర్ దాన్ బచ్చన్ అంటూ చిరంజీవి మీద ప్రముఖ టైం మ్యాగజైన్ ఆర్టికల్ వేయడం ఇప్పటికీ అభిమానులు గుర్తు చేసుకుంటారు. రామ్, నితిన్ లాంటి టయర్ 2 హీరోల హిందీ డబ్బింగులు యూట్యూబ్ లో వందల మిలియన్లు రాబట్టిన కారణం కూడా మాస్ కంటెంటే. మన ప్రభావం ఏ స్థాయిలో ఉందనేది చెప్పడానికి మరో ఉదాహరణ దొరికింది
ప్రముఖ మ్యాగజైన్ ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా నిర్వహించిన గ్రూప్ ఇంటర్వ్యూలో ఒక శాటిలైట్ ఛానల్ కు చెందిన ప్రతినిధి హాజరయ్యారు. ఓటిటి తదితర ప్రభావాల గురించి మాట్లాడుతూ తమ ఛానల్ లో ఎప్పుడైనా రేటింగ్స్ తగ్గుతున్నాయని అనిపించినప్పుడు చిరంజీవి ఇంద్ర హిందీ డబ్బింగ్ టెలికాస్ట్ చేస్తామని, ప్రతిసారి దాని వల్ల తమకు కోరుకున్న నెంబర్లు వస్తాయని, ఆ స్థాయిలో టాలీవుడ్ ఇంపాక్ట్ నార్త్ ఆడియన్స్ లో ఉందని వివరించారు. నిజంగా ఇది ఆశ్చర్యం కలిగించే. ఇంద్ర ఎంత బ్లాక్ బస్టర్ అయినప్పటికీ అది సీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన మూవీ. అయినా సరే అక్కడి జనాన్ని ఆకట్టుకుంటోంది.
ఒకరకంగా చెప్పాలంటే సోనీ మ్యాక్స్, గోల్డ్ మైన్స్ లాంటి ఛానల్స్ ని సజీవంగా ఉంచుతోంది మన తెలుగు డబ్బింగులే. నాగార్జున డాన్ లాంటివి భారీ రేటింగ్స్ తెచ్చుకున్న దాఖలాలు చాలా ఉన్నాయి. ఇంద్ర మన దగ్గర రికార్డులు బద్దలు కొట్టిన ఇండస్ట్రీ హిట్. ఇంతే స్థాయిలో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుందని తెలుసుకున్న ఫ్యాన్స్ ఇప్పుడీ వీడియోని సోషల్ మీడియాలో తెగ షేర్ చేసుకుంటున్నారు. గత ఏడాది రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న ఇంద్ర రీ రిలీజ్ లోనూ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మెగాస్టార్ హయ్యెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచిన ఇంద్ర అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని మాస్ క్లాసిక్.