ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవలే.. దుబాయ్‌లో మూడు రోజుల పాటు పర్యటించారు. పెట్టుబడుల వేటలో ఉన్న ఆయన.. గల్ఫ్ దేశాల్లో సుడిగాలి పర్యటనలు చేసి.. పెట్టుబడిదారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. అదేవిధంగా దుబాయ్ మంత్రులతోనూ భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ప్రవాసాంధ్రులను కలిసి.. పీ-4లో భాగస్వామ్యం కావాలని కోరారు. ఇలా.. మూడు రోజుల పాటు అనేక మందిని కలిసి పెట్టుబడులపై చర్చించారు.
ఈ క్రమంలో మరోసారి చంద్రబాబు పెట్టుబడుల వేటకు వెళ్తున్నారు. రేపటి(శనివారం, నవంబరు 1) నుంచి 5 రోజులపాటు లండన్ పర్యటనలో పర్యటించనున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలను కలిసి.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు. ముఖ్యంగా అమరావతి, విశాఖపట్నం లో ఇప్పటికే పెట్టుబడులకు ఉన్న అవకాశాలతోపాటు.. మరిన్ని అవకాశాలు కల్పించే విషయంపై వారితో చర్చించనున్నారు.
అదేవిధంగా విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు. విశాఖలో నవంబరు 14, 15 తేదీల్లో పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు జరగనుంది. దీనికి వారిని రావాలని కోరనున్నారు. అదేవిధంగా లండన్‌లో సీఐఐ ఆధ్వర్యంలో జరిగే రోడ్‌షోలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అదేవిధంగా ప్రవాసాంధ్రులతోనూ చర్చలు జరపనున్నారు. ముఖ్యమంత్రి వెంట.. మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్‌రెడ్డి, ఉన్నతాధికారులు కూడా లండన్‌లో పర్యటించనున్నారు. కాగా.. నవంబర్ 6న తిరిగి సీఎం చంద్రబాబు అమరావతికి తిరిగి రానున్నారు.