జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న రీతిలో మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తాజాగా చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. రేవంత్ రెడ్డి ఐదేళ్ల పాటు సీఎంగా ఉండాలని కేటీఆర్ ఆకాంక్షించారు. అలా అయితేనే, మరో 15 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి ఎవరూ ఓటేయరని కేటీఆర్ సెటైర్లు వేశారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటేనే తమకు లాభమని కేటీఆర్ చురకలంటించారు. రేవంత్ 2028 వరకు సీఎంగా ఉంటేనే కాంగ్రెస్ పార్టీ మరో పదిహేనేళ్లు తెలంగాణలో ఖాతా కూడా తెరవనంత స్థాయికి పడిపోతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ఎన్టీఆర్ ఏమన్నారో అందరూ గుర్తుంచుకోవాలని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని కాంగ్రెస్ నేతలు పెడతానంటున్నారని, అలా చేస్తే అన్నగారి ఆత్మక్షోభిస్తుందని చెప్పారు. తన పేరు తారక రామారావు అని, తన తండ్రి కేసీఆర్ టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి అని గుర్తు చేశారు.
రాష్ట్రానికి, హైదరాబాదుకు పట్టిన ఈ గ్రహణం వీడాలని, మళ్లీ కేసీఆర్ రావాలని కేటీఆర్ అన్నారు. 2014 నుంచి 2023 వరకూ కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరాభివృద్ధి అప్రతిహతంగా కొనసాగిందని, ఐటీ రంగం నుండి ఫార్మా రంగం వరకు అన్ని రంగాలు పరుగులు తీశాయని గుర్తు చేశారు. ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలు వెల్లువెత్తాయని, శాంతి భద్రతల నుండి పర్యావరణ పరిరక్షణ వరకు అన్నీ అద్భుతంగా నిర్వహించామని అన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగర ప్రతిష్ట మసకబారిందని, అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు.