చిన్నపిల్లాడిగా ఉండగా రుద్రమదేవి.. టీనేజీలో నిర్మలా కాన్వెంట్ సినిమాలు చేసిన శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా.. ఆ తర్వాత పెళ్ళిసందడి చిత్రంతో హీరోగా మారాడు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని తాజాగా ఛాంపియన్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. రోషన్‌కు ఇంకా ఆశించిన హిట్ పడలేదు కానీ.. అతడి లుక్స్, నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తనకు మంచి పేరే వచ్చింది.
ఛాంపియన్ సినిమాను పెద్ద బడ్జెట్ పెట్టి స్వప్న సినిమాస్ లాంటి పేరున్న నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేయగా.. తన తర్వాతి చిత్రాలను నిర్మించడానికి కూడా పేరున్న సంస్థలే ముందుకు వస్తున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బేనర్లలో అతను సినిమాలు చేయబోతున్నాడు. ముందుగా సితారలో హిట్ ఫ్రాంఛైజీ డైరెక్టర్ శైలేష్ కొలను రూపొందించబోయే సినిమాలో రోషన్ నటించనున్నాడు. ఈ సినిమా విశేషాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు రోషన్.
ఈసారి కెరీర్లో ఎక్కువ గ్యాప్ రాదని.. చాలా వేగంగా సినిమా చేసేయబోతున్నానని రోషన్ వెల్లడించాడు. సంక్రాంతి తర్వాత శైలేష్‌తో తన సినిమా షూట్ మొదలవుతుందని.. మూడు నాలుగు నెలల్లో సినిమాను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నామని.. రిలీజ్‌కు కూడా ఎక్కువ టైం పట్టదని అతను తెలిపాడు. శైలేష్ ఇప్పటిదాకా సీరియస్ థ్రిల్లర్ సినిమాలే తీశారని.. కానీ తనతో తీయబోయేది రొమాంటిక్ కామెడీ అని రోషన్ చెప్పాడు.
శైలేష్ తీసిన సినిమాలను బట్టి అతను చాలా సీరియస్ అనుకుంటారని.. అది నిజం కాదని.. వ్యక్తిగతంగా శైలేష్ ఫన్నీ క్యారెక్టర్ అని అతను చెప్పాడు. తన చుట్టూ ఉన్న వాళ్లను పంచులతో నవ్విస్తూనే ఉంటాడని.. అలాగే అతను కామెడీ కూడా చాలా బాగా రాస్తాడని.. అందుకే నీ ఒరిజినల్ స్ట్రెంత్ కామెడీనే అని తనకు చెప్పానని రోషన్ తెలిపాడు.
గీతా సంస్థలో రోషన్ చేయబోయే సినిమాకు దర్శకుడెవరన్నది ఇంకా వెల్లడిం కాలేదు. మరోవైపు రోషన్‌తో తమిళ లెజెండరీ డైరెక్టర్ గౌతమ్ మీనన్ కూడా ఓ సినిమా చేయాలని చూస్తున్నట్లు ఇంతకుముందు వార్తలు వచ్చాయి.