చిన్న సినిమాగా వచ్చి పెద్ద సెన్సేషన్ గా నిలిచిన లిటిల్ హార్ట్స్ హీరో మౌళి డిమాండ్ మాములుగా లేదు. ఒక అగ్ర నిర్మాణ సంస్థ ఏకంగా కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిందనే వార్త ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇది తన దృష్టికి తీసుకెళ్తే అలాంటిదేమి లేదని, నెక్స్ట్ చేయబోయే మూవీ మీద వర్క్ చేస్తున్నానని చెప్పి నవ్వుతున్నాడు తప్పించి ఆ వార్తని ధృవీకరించడం లేదు. నిజానికి మౌళి వెనుక ప్రొడక్షన్ హౌసులు పడుతున్న మాట వాస్తవం. డెబ్యూ లాగే యూత్ ఫుల్ స్టోరీస్ తో ఒప్పించేందుకు కొందరు దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇంకా ఏదీ ఖరారు చేసుకోలేదు.
లిటిల్ హార్ట్స్ కి అయిదు నుంచి పది లక్షల మధ్యలో మాత్రమే మౌళి తీసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఎంత హిట్టయినా ఒక్కసారిగా పదింతల రెమ్యునరేషన్ పెరగడం ఉండదు. డిమాండ్ కనిపిస్తున్నప్పటికీ అలా తొందరపడి అంత పెద్ద మొత్తాలు ఎవరూ ఆఫర్ చేయరు. ఏదో యాభై దాకా పలికిందంటే నమ్మొచ్చు కానీ మరీ కోటి అనేది పెద్ద ఫిగరని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. సరే ఏది ఎలా ఉన్నా మౌళి రెండో సినిమా మొదలుకావడానికి కొంత టైం పట్టేలా ఉంది. ఇండస్ట్రీ పోకడ ఎలా ఉందంటే హీరోల కంటే నిర్మాతలు ఎక్కువ ఉన్నారు. అందుకే ఫామ్ లో లేనివాళ్లు సైతం బిజీగా ఉన్న ట్రెండ్ గమనించవచ్చు.
ఇక్కడి నుంచే మౌళి చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నీ లిటిల్ హార్ట్స్ కాలేవు. ఒక్క ఫ్లాప్ రాత్రికి రాత్రి జాతకాలను మార్చేస్తుంది. అందులోనూ బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా వచ్చినప్పుడు సక్సెస్ ఉంటే తప్ప ఇక్కడ కెరీర్ కొనసాగించడం కష్టం. రవితేజ, నాని, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు ఇలాంటి ఢక్కామొక్కీలు చాలా చూసి తెలివైన ప్లానింగ్ తో ఇక్కడి దాకా వచ్చారు. మౌళికి ఇలాంటి జాగరూకత అవసరం. లిటిల్ హార్ట్స్ నిర్మించిన బ్యానర్ కే తను మరో కమిట్ మెంట్ ఇచ్చాడట. కాకపోతే కథ, దర్శకుడు సిద్ధంగా లేవు. అవి కుదరగానే కొంత ఆలస్యమైనా సరే ఆ సినిమా కూడా ఉంటుంది.