అక్కినేని మూడో తరం వారసుడిగా నాగ చైతన్యని మించిపోతాడని అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్న అఖిల్ కెరీర్ మొదలుపెట్టి దశాబ్దం అవుతున్నాపెద్ద బ్లాక్ బస్టర్ సాధించనే లేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బాగానే ఆడింది కానీ మరీ రికార్డులు బద్దలు కొట్టే రేంజ్ అయితే కాదు. ఏజెంట్ దెబ్బకు ఏకంగా ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న అఖిల్ తాజాగా లెనిన్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి కూడా అవరోధాలు తప్పలేదు. శ్రీలీలని హీరోయిన్ గా తీసుకుని కొంత భాగం షూట్ చేశాక ఆమె తప్పుకుంటే భాగ్యశ్రీ బోర్సేని తీసుకుని మళ్ళీ ఆ సీన్లు తీశారు. కాంత, ఆంధ్రకింగ్ తాలూకా ప్రమోషన్ల కోసం అమ్మడు పెద్ద బ్రేకే తీసుకుంది.
ఇంతకు ముందు అఖిల్ పెళ్లి కోసం కొంత విరామం ఇవ్వాల్సి వచ్చింది. ఇలా ఆగుతూ సాగుతూ వెళుతున్న లెనిన్ విడుదల ఎప్పుడో ఇంకా క్లారిటీ లేదు. సితార ఎంటర్ టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ వయొలెంట్ లవ్ స్టోరీలో చాలా షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటాయట. వినరో భాగ్యము విష్ణుకథ ఫేమ్ మురళికిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న లెనిన్ లో రాయలసీమ బ్యాక్ డ్రాప్, దైవత్వానికి సంబంధించిన అంశాలు ఇలా ఊహించని ప్యాకేజ్ రెడీ చేస్తున్నారని తెలిసింది. కాకపోతే రిలీజ్ గురించి అడిగితే మాత్రం నాగార్జున సర్ప్రైజ్ అంటున్నారు తప్ప క్లారిటీ ఇవ్వడం లేదు.
చూస్తుంటే 2026 వేసవి కంటే ముందు రావడం అనుమానంగానే ఉంది. లెనిన్ కున్న మరో సమస్య సోలో రిలీజ్. జనవరి నుంచి వరసగా నాలుగైదు నెలల పాటు పెద్ద రిలీజులు క్యూ కట్టి ఉన్నాయి. రాజా సాబ్ తో మొదలుపెట్టి అటుపై పెద్ది, ఉస్తాద్ భగత్ నుంచి కొనసాగుతూ విశ్వంభరతో కంటిన్యూ అవుతూ డజనుకి పైగానే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఎవరిదో ఎందుకు ఇదే సితార బ్యానర్ నిర్మిస్తున్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ సైతం సమ్మర్ నే టార్గెట్ చేసుకుంది. సో చూస్తుంటే 2026 ఫస్ట్ హాఫ్ లో స్లాట్ దొరకడం కష్టమే అయ్యేలా ఉంది. చూడాలి మరి లెనిన్ ఎప్పుడు వచ్చి అభిమానులను అలరిస్తాడో.