ఐపీఎల్ ట్రోఫీని గెలవాలని తొలి సీజన్ నుంచి ఎంతో ప్రయత్నించినా.. 16 సంవత్సరాల పాటు ఆ కలను నెరవేర్చుకోలేకపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఐదేసి కప్పులు సాధించగా.. బలం, ఆకర్షణ పరంగా ఆ రెండు జట్లకూ ఏమాత్రం తీసిపోనట్లు కనిపించే ఆర్సీబీకి మాత్రం ఒక్క కప్పూ దక్కలేదు. ప్రతిసారీ భారీ అంచనాలతో బరిలోకి దిగడం.. ఏదో ఒక దశలో నిష్క్రమించడం.. ఇదీ వరస.
ఆర్సీబీ కప్పు గెలవకపోవడంపై ఎన్నో ఏళ్ల నుంచి ఎంత ట్రోలింగ్ జరుగుతూ వచ్చిందో తెలిసిందే. కోహ్లి సారథ్యంలో పుష్కర కాలం పాటు ప్రయత్నించి ఫెయిలైన ఆర్సీబీ.. ఎట్టకేలకు ఈ ఏడాది రజత్ పటిదార్ నాయకత్వంలో కలను నెరవేర్చుకుంది. కోహ్లి కూడా ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. గెలిచిన అనంతరం ఆర్సీబీ ఆటగాళ్లు, యాజమాన్యం, అభిమానుల ఆనందానికి అవధులే లేకపోయాయి.
కానీ ఇంత సాధించి ఏం లాభం? వాళ్ల ఆనందం కొన్ని రోజులు కూడా నిలవలేదు. ఆర్సీబీ విజయోత్సవ సంబరాల సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుని 11 మంది చనిపోవడంతో ఆనందం ఆవిరైపోయింది. ఆ విషాదం వల్ల ఆర్సీబీ చుట్టూ తీవ్రమైన నెగెటివిటీ ముసురుకుంది. విమర్శలు, ఆరోపణలు, కేసులతో ఆర్సీబీ ప్రతిష్ట మసకబారింది. ఇది ఆర్సీబీ బ్రాండ్ వాల్యూను కూడా దెబ్బ తీసింది. చివరికి ఇప్పుడు ఆర్సీబీ యాజమాన్యం జట్టును అమ్మడానికి రెడీ అయిపోయింది.
ఒక టీం కప్పు గెలిస్తే బ్రాండ్ వాల్యూ పెరగడం.. యజమానుల్లో ఇంకా ఉత్సాహం రావడం చూస్తుంటాం. కానీ ‘ఆర్సీబీ’ విషయంలో దీనికి భిన్నంగా జరగబోతోంది. ఆర్సీబీ సేల్ పూర్తయితే.. వచ్చే ఏడాది జట్టు పేరే మారిపోతుంది. అంటే డిఫెండింగ్ ఛాంపియన్ అని చెప్పుకోవడానికి ఆర్సీబీనే ఉండదన్నమాట. ఇలా కప్పు గెలవగానే తర్వాతి ఏడాదికి ఆ పేరే లేకుండా పోవడం ఎప్పుడూ జరగలేదు. డెక్కన్ ఛార్జర్స్ విషయంలో కొన్నేళ్ల తర్వాత జరిగింది. ఆర్సీబీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న కోహ్లి లాంటి ఆటగాళ్లకు, అభిమానులకు ఇది తీవ్ర నిరాశ కలిగించే విషయమే.