hyderabadupdates.com movies లేట్ అయినా టాప్ లేపేస్తోంది

లేట్ అయినా టాప్ లేపేస్తోంది

తెరమీద చూసే డ్రామాని మించిపోతోంది ‘కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్’ రిలీజ్ వ్యవహారం. నిన్నటి దాకా జీవోల కోసం వెయిట్ చేశారు. ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది కానీ తెలంగాణ నో అంది. దీంతో ఆన్ లైన్ బుకింగ్స్ పెట్టడంలో విపరీతమైన ఆలస్యం జరిగింది. ముందు రోజు రాత్రి ప్రీమియర్లు లేవన్నారు. మధ్యాన్నం దాకా అదే అయోమయం కొనసాగింది. కట్ చేస్తే హఠాత్తుగా యాప్స్ లో రాత్రి పది గంటల షోల నుంచి ఏపీ టికెట్లు పెట్టేశారు. పెట్టడం ఆలస్యం క్షణాల్లో హౌస్ ఫుల్స్ అయిపోతున్నాయి. బుక్ మై షోలో గంటకు 35 వేల దాకా టికెట్లు అమ్ముడుపోవడం అనూహ్యం. దీన్ని బట్టే క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.

కాంతార ఫస్ట్ పార్ట్ ప్రభావం తెలుగు ఆడియన్స్ మీద ఎంత ఉందో తేటతెల్లమవుతోంది. ఒకవేళ నైజామ్ లోనూ షోలు వేసి ఉంటే ట్రెండింగ్ పరంగా రికార్డులు నమోదయ్యేవని ట్రేడ్ టాక్. డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రి మేకర్స్ విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ సఫలం కాలేకపోయారట. ఏపీలో కూడా షోలు వేయాలా వద్దా అనే మీమాంస గంటల తరబడి కొనసాగాక, తెల్లవారితే పండగ ఉంది కాబట్టి సెకండ్ షోలు వేయడం ఉత్తమమని భావించి చివరి నిమిషంలో నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ, వైజాగ్, కర్నూలు తదితర ప్రాంతాల్లో సింగల్ షోతో మొదలుపెడితే కేవలం నిమిషాల వ్యవధిలో మరికొన్ని స్క్రీన్లు జోడించాల్సి వచ్చింది.

ఇప్పుడు అర్ధరాత్రి వచ్చే టాక్ కాంతారా చాప్టర్ 1 ఏ లెజెండ్ కు కీలకం కానుంది. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా ఉండబోతున్న నేపథ్యంలో నెటిజెన్ల చూపంతా అక్కడే ఉంది. రిషబ్ శెట్టి కన్నడ స్పీచ్ వివాదం, బెంగళూరులో ఓజి షోలను కొందరు అడ్డుకున్న కాంట్రావర్సి, ఏపీ టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు ఇవ్వడం లాంటి కారణాలు కొంత వ్యతిరేకత తీసుకొచ్చాయి. అయితే ఇవేవి కాంతార మీద మన జనాల ఆసక్తిని తగ్గించలేకపోయాయి. మరి కాంతార కనకవర్షం కురిపించాలంటే బాగుంది చూడొచ్చు కానీ ఆహా అదిరిపోయిందనే టాక్ రావాల్సిందే. అతి కొద్దిగంటల్లో తేలనుంది. చూద్దాం.

Related Post