తొలి సినిమాతోనే వంద కోట్ల వసూళ్లు రాబట్టడం అన్నది ఎంత పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్న హీరోకైనా చాలా పెద్ద టార్గెట్టే. ‘ఉప్పెన’ సినిమాతో ఈ సెన్సేషనల్ ఫీట్ సాధించాడు వైష్ణవ్ తేజ్. ఆ సినిమా సక్సెస్ క్రెడిట్లో హీరోకు మేజర్ షేర్ ఇవ్వలేం కానీ.. డెబ్యూలోనే తన పేరు మీద వంద కోట్ల సినిమా ఉండడం మాత్రం తనకు పెద్ద ప్లస్ అనడంలో సందేహం లేదు. కానీ ‘ఉప్పెన’తో వచ్చిన హైప్‌ను అతను సరిగా ఉపయోగించుకోలేకపోయాడు.
వైష్ణవ్ రెండో చిత్రం ‘కొండపొలం’ దారుణమైన ఫలితాన్నందుకుంది. మూడో చిత్రం ‘రంగ రంగ వైభవంగా’, నాలుగో మూవీ ‘ఆదికేశవ’ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అయ్యాయి. తొలి సినిమాతో వచ్చిన పేరు, మార్కెట్ మొత్తాన్ని తర్వాతి మూడు సినిమాలు తుడిచిపెట్టేసి వైష్ణవ్‌ను నేల మీదికి తెచ్చేశాయి. దీంతో తర్వాత ఎలాంటి సినిమా చేయాలనే విషయంలో అయోమయంలో పడిపోయాడీ మెగా కుర్రాడు.
‘ఆది కేశవ’ రిలీజై రెండేళ్లు కావస్తోంది. ఇప్పటిదాకా తన తర్వాతి సినిమాను వైష్ణవ్ ప్రకటించలేదు. అసలు ఈ రెండేళ్లలో తన కొత్త సినిమా గురించి ఏ కబురూ వినిపించకపోవడం ఆశ్చర్యకరం. మరీ ఇంత గ్యాప్ తీసుకుంటే ప్రేక్షకులు హీరోను మరిచిపోయే అవకాశముంది. కొత్త సినిమాకు బజ్ క్రియేట్ చేయడం కూడా కష్టమే. ఈ రెండేళ్లలో ఒక్క కథను కూడా ఓకే చేసి ముందుకు తీసుకెళ్లకపోయాడంటే వైష్ణవ్ అంత జాగ్రత్త పడుతున్నాడా.. లేక తన దగ్గరికి కథలు రావడం లేదా అన్నది ప్రశ్నార్థకం.
ఐతే లేటెస్ట్‌గా వినిపిస్తున్న కబురేంటంటే.. అతను విక్రమ్ కుమార్ నుంచి నరేషన్ విన్నాడట. ఈ ప్రాజెక్టును సీరియస్‌గా పరిగణిస్తున్నాడట. విక్రమ్‌కు కూడా కెరీర్లో బాగా గ్యాప్ వచ్చింది. హలో, గ్యాంగ్ లీడర్, థాంక్యూ ప్లాపులతో అతను వెనుకబడిపోయాడు. తర్వాత ‘ధూత’ వెబ్ సిరీస్‌తో మెప్పించినా.. కొత్త సినిమాను పట్టాలెక్కించలేకపోతున్నాడు. నితిన్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలను ట్రై చేసినా సినిమా ఓకే కాలేదు. మరి వైష్ణవ్‌తో తన సినిమా అయినా అన్ని అడ్డంకులనూ దాటి ముందుకు వెళ్తుందేమో చూడాలి.