ఏపీ సీఎం చంద్రబాబుకు భారీ కితాబు దక్కింది. “సరైన సమయంలో సరైన నాయకుడు.. ఏపీకి ఉండడం గొప్ప విషయం“ అంటూ.. ఉపరాష్ట్రపతి సీపీరాధాకృష్ణన్ ప్రశంసలతో కొనియాడారు. విశాఖపట్నంలో జరుగుతున్న పెట్టుబడి దారుల భాగస్వామ్య సదస్సును ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు విజన్‌నుతాను చాలా దగ్గరగా చూశారని చెప్పారు. గతంలో వాజపేయి ప్రధానిగా ఉన్నప్పటి నుంచి ఆయన చక్రం తిప్పుతున్నారని అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక సంస్కరణలు తీసుకువచ్చి.. ముఖ్యమంత్రులకు సీఎం చంద్రబాబు ఆదర్శంగా నిలిచారని తెలిపారు. “ఒకప్పుడు సంస్కరణలు అంటే భయపడేవారు. అదేదో ఇబ్బందికర అంశంగా మారిపోయింది. అయితే.. అలాంటి సమయంలో విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చి.. అనేక మంది ముఖ్యమంత్రులకు చంద్రబాబు ఆదర్శంగా నిలిచారు. ఆయనను చాలా దగ్గరగా చూశాను. మంచి పాలనాదక్షుడు“ అని సీపీ రాధాకృష్నన్ కితాబునిచ్చారు.
అంతేకాదు.. ప్రస్తుత ఏపీకి కూడా చంద్రబాబు అవసరం ఎంతో ఉందన్నారు. సరైన సమయంలో సరైన నాయకుడు ఏపీకి లభించడం.. ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టంగా తాను భావిస్తున్నట్టు సీపీ రాధాకృ ష్ణన్ తెలిపారు. పెట్టుబడులను దూసుకురావడంలోనూ చంద్రబాబు ఘనాపాఠి అని తెలిపారు. “ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ చంద్రబాబు ఉంటారు. ఏదైనా మేలు చేయాలన్నది ఆయన తలంపు. అందుకే.. నేటికీ చంద్రబాబు విజన్ అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకంగా మారింది.“ అని ఉపరాష్ట్రపతి చెప్పారు.
ఇదేసమయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపైనా రాధాకృష్ణన్ ప్రశంసలు జల్లు కురిపించారు. గత 11 సంవత్సరాలుగా మోడీ సర్కారు పేదల జీవితాలను మార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. కోట్ల మంది సొంతింటి కలలను సాకారం చేసిందన్నారు. ప్రస్తుతం ఎం.ఎస్.ఎంఈల ద్వారా పారిశ్రామిక వేత్తలుగా యువతను తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకుందని చెప్పారు.