ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలపై ఆయన పరోక్షంగా విరుచుకుపడ్డారు. `వారంతా నయా నరకాసురులు` అని పేర్కొన్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్.. నయా నరకాసురులను ప్రజలు ప్రజాస్వామ్య యుద్ధంలో మట్టుబెట్టారని అన్నారు. అయినా.. కొన ప్రాణంతో ఉన్న వారు.. ఇంకా అరాచకాలు సృష్టిస్తున్నారని తెలిపారు. ప్రజల మధ్య విభేదాలు పెడుతున్నారని తెలిపారు.
కులాలు, మతాలకు మధ్య కూడా చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ.. వైసీపీ నేతలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇలాంటి వారి విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలకు సూచించారు. దీపావళి పండుగ వేళ కూడా.. వివాదాలకు తెరదీసే పనులు చేస్తున్నారని.. రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే వారికి ఇష్టం ఉండదని.. ఎప్పుడూ రావణ కాష్ఠంగా మండాలని కోరుకుంటారని వ్యాఖ్యానించారు. ఇటీవల ప్రకాశం జిల్లాలోని కందుకూరులో జరిగిన ఘటనను పరోక్షంగా పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. ఇలాంటి ఘటనలతో ప్రభుత్వంపై విమర్శలు వస్తాయని.. భావిస్తున్నారని అన్నారు.
కానీ, ప్రజలకు అన్నీ తెలుసునన్న పవన్ కల్యాణ్.. వారు రెచ్చిపోకుండా సంయమనం పాటిస్తున్నారని తెలిపారు. దీపావళి రోజు ప్రజలు హరిత దీపావళిని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడుకుంటేనే భావితరాలకు మేలు జరుగుతుందన్నారు. ప్రస్తుతం పర్యావరణం చాలా కీలకంగా మారిందన్న ఆయన ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలంటే పర్యావరణం అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని హరిత దీపావళిని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. దీపావళి పండగ ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ విజయాన్ని అందించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.