ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పొలంబాట పట్టారు. తుఫాను ప్రభావంతో భారీగా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పొలాలను ఆయన పరిశీలించారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో గురువారం పర్యటించిన పవన్ కల్యాణ్.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని రైతులను పరామర్శించారు. కోడూరు మండలం కృష్ణాపురం గ్రామంలో నేలకొరిగిన వరి పైరు పరిశీలించారు. బురదలోనే నడుస్తూ.. పొలం మధ్యకు వెళ్లి పరిశీలించారు.
రైతుల సమస్యలను ఓపికగా విన్నారు. వారికి భరోసా కల్పించారు. ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. తుఫాను ప్రభావంతో ప్రాణ నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్న పవన్ కల్యాణ్.. పంటలు, ఇళ్లకు నష్టం కలిగిందని.. దీని నుంచి రైతులను కాపాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అనంతరం అవనిగడ్డ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద తుఫాన్ ప్రభావ దృశ్యాలతో కూడిన ఫోటో ఎక్సిబిషన్ పరిశీలించారు. జరిగిన నష్టాన్ని కలెక్టర్ బాలాజీ ని అడిగి తెలుసుకున్నారు.
సీఎం చంద్రబాబు సహా మంత్రులు అందరూ నిరంతరం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిని అంచనా వేశారని పవన్ కల్యాణ్ తెలిపారు. అందుకే.. ప్రాణ నష్టం ముప్పు నుంచి తేరుకున్నామన్నారు. అయితే.. పంటలు, ఇళ్లు కూడా దెబ్బతిన్నాయని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అయితే.. ప్రస్తుతం ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని.. నష్టాలను అంచనా వేసుకుని.. ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు.