వైసీపీ అధినేత జగన్ తాజాగా మరోసారి వింత వ్యాఖ్యలు చేశారు. “అవును.. జగనన్న ఉంటే ఇలా జరిగేది కాదు“ అని ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవానికిఆయన ఏ కాంటెస్టులో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదుకానీ.. దీనికి రైతులు కొందరు నవ్వుకున్నారు. ఇటీవల గూగుల్ డేటా కేంద్రంపైనా ఆయన ఇలానే వ్యాఖ్యానించి సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు గురయ్యారు. తాజాగా కృష్ణాజిల్లాలో మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారిని ఓదార్చారు. సహజంగానే ప్రతిపక్ష నేత కాబట్టి.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఈ క్రమంలో “నేనుంటే ఇలా జరిగేది కాదు“ అని వ్యాఖ్యానించారు. అయితే.. ఆయన ఉంటే మొంథా తుఫాను వచ్చేది కాదన్న అర్థంలో అన్నారో.. లేక సాయం విషయంలో అన్నారో.. తెలియక రైతులు దిక్కులు చూశారు. ఇక, కృష్ణాజిల్లా రామరాజుపాలెం ప్రాంతంలోని ఆకుమర్రు లాకు వద్ద పంట పొలాలను జగన్ పరిశీలించారు. అయితే.. ఈ సందర్భంగా కొందరు రైతులు తమ పొలాల్లోకి దిగాలని సూచించినా.. జగన్.. మాత్రం గట్టుపైనే ఉండి పరిశీలించారు. దీంతో పలువురు రైతులు.. తడిసిపోయిన పంటలను జగన్‌కు చూపించారు.
అనంతరం జగన్ మాట్లాడుతూ.. తమ హయాంలో రైతులను ఆదుకున్నామని.. వారికి బీమా కల్పించామని చెప్పారు. వైసీపీ పాలనలో 85 లక్షల మంది రైతులకు బీమా అందిస్తే.. ఇప్పుడు ఈ సంఖ్య 19 లక్షలకు కుదించారని విమర్శించారు. మొత్తంగా 25 జిల్లాల్లో పంటనష్టం జరిగిందన్న ఆయన.. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. మరికొందరు రైతులు.. తమ వద్దకు అధికారులు వచ్చి వివరాలు తీసుకుని వెళ్లారని చెప్పారు.
అనంతరం జగన్ మీడియాతోనూ మాట్లాడారు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్నివిషయాల్లోనూ విఫలమైందని ఆరోపించారు. రైతులకు సరైన సమయంలో సొమ్ములు కూడా ఇవ్వడం లేదని అన్నారు. మొంథా తుఫాను వస్తుందన్న హెచ్చరికలు ఉన్నా.. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకుండా తాత్సారం చేయడంతో రైతులు నష్టపోయారని అన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు వైసీపీ వారికి అండగా నిలుస్తుందని చెప్పారు. 25 జిల్లాల్లో మొంథా తుఫాను ప్రభావం కనిపించిందని, 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, కానీ ప్రభుత్వం తూతూమంత్రంగా వ్యవహరిస్తోందని అన్నారు. కూటమి పాలనలో రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్(పంటల బీమా) ఇవ్వడం లేదని అన్నారు.