తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ అధినేత, సినీ హీరో ఇళయ దళపతి విజయ్‌కు భారీ ఉరట లభించింది. ఆయన కోరుకున్నట్టుగానే తమిళనాడులో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించేందుకు సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. దీంతో సీబీఐ విచారణకు మార్గం సుగమం అయింది. కొన్నాళ్ల కిందట.. సీబీఐ వేసేందుకు మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో అటు ప్రభుత్వాన్ని, ఇటు విజయ్‌ను కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టింది.
ఈ సందర్భంగా జస్టిస్ మహేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రాణాల పట్ల బాధ్యత లేకుండా పోతోందని, కరూర్ ఘటన దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందని, అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిందని వ్యఖ్యానించారు. ఈ ఘటన వెనుక అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయన్న వాదన కూడా వినిపిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణకు ఆదేశించడమే సరైన విధానమని పేర్కొన్నారు. ఈ విచారణకు పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్ రస్తోగీ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు పురోగతిని ప్రతి నెలా కోర్టుకు సమర్పించాలని పేర్కొన్నారు.
41 మంది మృతి-అనేక విమర్శలు..
గత సెప్టెంబరు 27న టీవీకే పార్టీ అధినేత విజయ్ పార్టీ ప్రచారంలో భాగంగా కరూర్ జిల్లా వేలు సామి పురంలో ర్యాలీ నిర్వహించారు. దీనికి భారీ ఎత్తున జనాలను సమీకరించారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి .. తొలుత 10 మంది తర్వాత.. 22 మంది చివరకు 41 మంది మృతి చెందారు. ఈ ఘటన రాజకీయంగా దుమారం రేపింది. అధికార పార్టీ డీఎంకేపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. సరైన ఏర్పాట్లు చేయనందుకే ఇలా జరిగిందని బీజేపీ నాయకులు, అన్నా డీఎంకే నేతలు విరుచుకుపడ్డారు.
అయితే.. డీఎంకే మాత్రం విజయ్ తప్పుచేశారని, చెప్పిన సమయానికి రాకుండా.. జన సమీకరణ కోసం ప్రయత్నించారని ఆరోపించింది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ నేతృత్వంలో కమిటీ వేశారు. కానీ, విజయ్ మాత్రం అసలు సీబీఐ విచారణ చేయించాలని కోరారు. మొత్తానికి ఈ విషయంలో ఆయనకు రిలీఫ్ లభించింది. అయితే.. ఈ దర్యాప్తు.. ఎప్పటికి ముగుస్తుందన్న విషయంపై సుప్రీంకోర్టు ఎలాంటి గడువు విధించలేదు.