తమిళ సినిమాలో రజినీకాంత్ ఉండగా ఆయన్ని మించే హీరో ఇంకొకరు రారనే అంతా అనుకున్నారు. కానీ గత కొన్నేళ్లలో సూపర్ స్టార్‌ను మించిన ఇమేజ్, మార్కెట్‌తో విజయ్ కోలీవుడ్ నంబర్ వన్ స్థానాన్ని దాదాపుగా చేజిక్కించుకున్నాడు. జైలర్, కూలీ సినిమాలతో రజినీ భారీ వసూళ్లు రాబట్టినా సరే.. సినిమాల బిజినెస్, ఓపెనింగ్స్ విషయంలో విజయ్ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వేరు.
ఐతే కెరీర్లో పతాక స్థాయిని అందుకున్న సమయంలోనే సినిమాలకు టాటా చెప్పేసి రాజకీయాల వైపు అడుగులేస్తున్నాడు విజయ్. తన చివరి చిత్రం ‘జననాగయన్’ ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. భవిష్యత్తులో మళ్లీ అవకాశాన్ని బట్టి సినిమాలు చేస్తే చేయొచ్చు కానీ.. ప్రస్తుతానికి అదే తన చివరి చిత్రం. చివరగా విజయ్ పాల్గొనే సినిమా ఈవెంట్ కోసం తన ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ వారికి తీవ్ర నిరాశ కలిగిస్తూ.. చెన్నైలో ఈవెంట్ లేకుండా చేసేశాడు విజయ్.
కొన్ని నెలల కిందట కరూర్లో జరిగిన విజయ్ రాజకీయ కార్యక్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుని 40 మంది దాకా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ చివరి సినిమా ఈవెంట్‌ను చెన్నైలో నిర్వహిస్తే.. అభిమానులను కంట్రోల్ చేయడం కష్టమని భావించారు. ఈ వేడుకను మలేషియాకు తరలించారు. శనివారమే ఈ వేడుకను అక్కడ భారీగా నిర్వమించబోతున్నారు.
కరూర్ ఘటన నేపథ్యంలో రాజకీయ ఈవెంట్ల విషయంలో కూడా డిఫెన్స్‌లో పడిపోయి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు విజయ్. ఇలాంటి టైంలో తన చివరి సినిమా ఈవెంట్ మీద అభిమానుల్లో ఉండే అంచనాల దృష్ట్యా వారి అత్యుత్సాహం వల్ల ఏదైనా తేడా జరిగితే అది విజయ్ పొలిటికల్ కెరీర్‌కు చాలా ఇబ్బందిగా మారుతుంది. విజయ్‌ను దెబ్బ తీయడం కోసం ఈ ఈవెంట్‌కు ప్రభుత్వం సరైన భద్రత ఏర్పాట్లు చేస్తుందా అనే సందేహాలు కూడా ఉన్నాయి.
ఇలా అన్నీ ఆలోచించుకుని ఆడియో వేడుకను మలేషియాకు మళ్లించాడు విజయ్. అభిమానులు తనను నేరుగా చూడలేకపోవడం వారికి నిరాశ కలిగించినా.. తన సందేశం వారికి వెళ్లడమే ముఖ్యమని అతను భావిస్తున్నాడు. ఈ వేడుకలో విజయ్ సుదీర్ఘ ప్రసంగమే చేయబోతున్నాడని.. తన సినీ ప్రయాణాన్నంతా గుర్తు చేసుకోవడంతో పాటు పొలిటికల్ జర్నీ గురించి కూడా మాట్లాడతాడని భావిస్తున్నారు.