అనగనగా ఒక చిన్న పల్లెటూరు. ఆ గ్రామానికి ఒక శాపమో, దెయ్యమో ఆవహించి ఉంటుంది. దాన్ని వదిలించాలంటే హీరో రంగంలోకి దిగాలి. హీరోయిన్ ఏదో ఒక రూపంలో సాయం చేయాలి. చివర్లో దేవుడు వచ్చినా రాకపోయినా కథను సుఖాంతం చేసి కొన్ని గూస్ బంప్స్ అనిపించే ఎపిసోడ్స్ తో జనాన్ని సంతృప్తి పరచాలి. చాలు. ఖేల్ ఖతం. బాక్సాఫీస్ గేమ్ షురూ.
ఇక్కడ చెప్పిన పాయింట్ ని సరిగా వాడుకోవాలే కానీ టాలీవుడ్ కు ఈ జానర్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫార్ములాగా మారుతోంది. ‘శంబాల’ లాంటి చిన్న బడ్జెట్ మూవీ ఇంత పెద్ద విజయం సాధించడం గురించి జనాలే కాదు ఇండస్ట్రీ వర్గాలు కూడా మాట్లాడుకుంటున్నాయి.
అయితే ఇదిప్పుడు హఠాత్తుగా మొదలైన ట్రెండ్ కాదు. సాయి దుర్గ తేజ్ కు మంచి కంబ్యాక్ గా నిలిచిన ‘విరూపాక్ష’ ఎంత హిట్టో గుర్తు చేయనక్కర్లేదు. ఊహించని మలుపులు, క్లైమాక్స్ ట్విస్ట్ జనాలను ఓ రేంజ్ లో మెప్పించాయి. ‘మా ఊరి పొలిమేర 2’ ఓటిటి సీక్వెల్ గా థియేటర్లో అడుగుపెట్టినా ఆడియన్స్ ఆదరించడానికి కారణం అందులో ఉన్న టెంపోనే.
‘మసూద’లో దేవుళ్ళ ప్రస్తావన పెద్దగా లేకపోయినా దెయ్యాలతో నడిపించిన సీరియస్ డ్రామా మంచి లాభాలు తీసుకొచ్చింది. సందీప్ కిషన్ ఖాతాలో పడ్డ హిట్టు ‘ఊరి పేరు భైరవకోన’ కూడా ఇదే బాపతులోకే చేరుతుంది. ఇవన్నీ గ్రామీణ నేపథ్యంలో సాగే డ్రామాలే.
అలాని ప్రతి సినిమా సక్సెస్ అవుతుందని కాదు. స్క్రీన్ ప్లేని పకడ్బందీగా రాసుకుంటే ఇలాంటి స్టోరీలు మళ్ళీ మళ్ళీ చెప్పినా చూస్తారని చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణలు కావాలా. మరో లేటెస్ట్ హిట్ ‘ఈషా’ని మొదలుపెట్టేది సిటీలోనే అయినా అసలు ప్లాట్ జరిగేది చిన్న ఊరిలోనే.
బయట చూడని సాధ్యం కాని ఆత్మల గోలను ఎంత బాగా చూపించగలిగితే అంత విజయం దక్కుతుందని చెప్పడానికి ఇవి కేవలం కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. నాగచైతన్య ‘వృషకర్మ’ కూడా ఇలాంటి కాన్సెప్ట్ తోనే రూపొందుతోందని ఇన్ సైడ్ టాక్. బాలీవుడ్ లో కామెడీ హారర్ రాజ్యమేలుతుంటే మన దగ్గర విలేజ్ దెయ్యాలు కలెక్షన్లు కురిపిస్తున్నాయి.