hyderabadupdates.com movies వివాదాలు ఇప్పుడే ఇన్ని చుట్టుముడితే ఎలా

వివాదాలు ఇప్పుడే ఇన్ని చుట్టుముడితే ఎలా

ఎలాంటి కాంట్రవర్సీలు వచ్చినా కూల్ గా హ్యాండిల్ చేయడం రాజమౌళి స్టైల్. ఆర్ఆర్ఆర్ టైంలో ఈ సంయమనం చూపించడం వల్లే కొమరం భీమ్ ఇష్యూ రాద్ధాంతం కాకుండా ఆగిపోయింది. లేదంటే జూనియర్ ఎన్టీఆర్ వేషధారణ, అల్లూరి సీతారామరాజుతో స్నేహం గురించి చరిత్రకారులు పెద్ద గొడవే చేసేవారు. వారణాసి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హనుమంతుడి గురించి చేసిన కామెంట్లు ఇంకా వేడిని కోల్పోకుండా మరింత ఆజ్యాన్ని అందుకుంటూనే ఉన్నాయి. తాజాగా బిజెపి నాయకులు కొందరు జక్కన్న మాటల గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన ప్రకటించడం రాజకీయ రంగు పులుముకుంది.

ఇంకోవైపు వారణాసి టైటిల్ తమందంటూ ఫిలిం ఛాంబర్ లేఖతో సహా ఆధారాలు బయట పెట్టిన మరో ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంకా సెటిల్ మెంట్ జరగలేదట. రాజీ ప్రతిపాదన వెళ్లిందట కానీ ఇంకా రెండు వర్గాలు చర్చలకు రాలేదని సమాచారం. ఇంకా బోలెడు టైం ఉంది కాబట్టి అందరికీ అనువైన సమయంలో మీటింగ్ పెట్టేసి క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో పెద్దలున్నారు. రాజమౌళి వారణాసి ప్యాన్ వరల్డ్ మూవీ కాబట్టి తనకు అనుగుణంగానే నిర్ణయం ఉండేలా చొరవ తీసుకోవచ్చు. మరి టైటిల్ రిజిస్టర్ చేసుకున్న హక్కుదారుకు న్యాయం అనిపించేలా ఏదైనా పరిహారం ముట్టజెప్పే ఛాన్స్ లేకపోలేదు.

ఇదింకా ప్రారంభమే. షూటింగ్ సగం కూడా కాలేదు. రాబోయే రోజుల్లో రాజమౌళి ఇంకెన్ని గొడవలు చూడాలో ఏంటో అని ఫ్యాన్స్ మధనపడుతున్నారు. ఎన్నడూ లేనిది జక్కన్న మీద నెగటివిటీ కనిపించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంకోవైపు టీమ్ ప్రమోషన్లు ఆపడం లేదు. మహేష్ బాబుతో పాటు మెయిన్ క్యాస్టింగ్ తో కొన్ని ఇంటర్వ్యూలు పూర్తి చేశారు. వీటిని అంతర్జాతీయ స్థాయిలో ప్రాజెక్టుని పరిచయం చేయడం కోసం వాడుకోబోతున్నారు. చుట్టూ ఇంత రభస జరుగుతున్నా రాజమౌళి తన పనిలో తాను బిజీగా ఉన్నారట. వెనకుండి పరిష్కారాలు వెతికేందుకు కార్తికేయ ఉంటే టెన్షన్ ఎందుకని కావొచ్చు.

Related Post