“విచ్చలవిడిగా రెచ్చిపోతున్న వీధికుక్కల వ్యవహారం.. దేశ ప్రతిష్ఠను, పరువును కూడా దిగజారేలా చేస్తోంది. అసలు ఏమనుకుంటున్నారు. ప్రపంచ దేశాలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. ఈ విషయాన్ని గుర్తిస్తున్నారా?“ అని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. వీధి కుక్కల దాడులు.. ఢిల్లీలోని పరిణామాలపై గత ఆగస్టులోనే విచారించిన సుప్రీంకోర్టు.. అప్పట్లోనే ప్రభుత్వాలను తీవ్రంగా మందలించింది. ఢిల్లీ నుంచి వీధి కుక్కలను తరిమేయాలని కూడా ఆదేశించింది.
కానీ, అప్పట్లో సినీ రంగం సహా.. పారిశ్రామిక రంగం నుంచి పెద్దలు జోక్యం చేసుకుని సుప్రీంకోర్టు పునఃస్సమీక్షించాలని కోరారు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు.. వీధి కుక్కల దాడులు, ప్రభుత్వాల ఉదాసీన వైఖరిని తప్పుబట్టింది. వీధికుక్కల కారణం భారత ప్రతిష్ఠ అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతింటోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వీధి కుక్కల క్రూరత్వం, దాడులు పెరగడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వీధి కుక్కల దాడి ఘటనలు నిరంతరం జరుగుతున్నాయని, మన దేశాన్ని విదేశీయులు కించపరిచేలా మాట్లాడటానికి ఇవి ఆస్కారం కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించింది.
అంతేకాదు.. గత ఆగస్టులో కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నారా? లేదా? అని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అదేసమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదీ వివరించకపోవడాన్ని, అఫిడవిట్లు దాఖలు చేయకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఇలా అయితే.. తామే ఈఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించింది. గత ఆదేశాలకు అనుగుణంగా అఫిడవిట్లు దాఖలు చేయని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్ సమన్లు జారీ చేశారు.
తమ ఆదేశాల మేరకు పశ్చిమ బెంగాల్, తెలంగాణ ప్రభుత్వాలు మాత్రమే అఫిడవిట్లు వేశాయని.. ఇతర రాష్ట్రాలు ఏవీ అఫిడవిట్లు దాఖలు చేయలేదని పేర్కొంది. ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలు ఎందుకు అఫిడవిట్లు దాఖలు చేయలేదని నిలదీసింది. వీరికి సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు.