hyderabadupdates.com movies వైసీపీ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ బాబు అసంతృప్తి

వైసీపీ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ బాబు అసంతృప్తి

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న పార్టీ శ్రేణులను పక్కనబెట్టి కొత్తగా వైసీపీ నుంచి వచ్చిన వారికి కొందరు ఎమ్మెల్యేలు ప్రాధాన్యత ఇస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. క్షేత్రస్థాయి నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నానని, సీనియర్లను, పార్టీ శ్రేణులను పక్కనబెట్టి కొత్తగా బయట నుంచి వచ్చిన వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం సరికాదన్నారు.

మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లోని పార్టీ కార్యాలయ విభాగాలతో ఆయన నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక సూచనలు చేశారు. పార్టీ కార్యకలాపాలు, ప్రజా సమస్యల పరిష్కారం, నాయకుల బాధ్యతలపై ముఖ్యమంత్రి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎమ్మెల్యేలకు నచ్చిన కార్యకర్తలే కాకుండా పార్టీలోని సీనియర్స్‌ను కూడా కలుపుకొని పోవాలని సూచించారు. ప్రతి రోజు కార్యాచరణను అమలు చేసి, వారానికోసారి విశ్లేషించి, నెలకోసారి సమీక్షించి, ప్రజల అభిప్రాయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటున్నానని, ప్రతిఒక్కరి పనితీరుకు సంబంధించిన సమాచారం తన వద్ద ఉందని చంద్రబాబు తెలిపారు.

క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం గ్రామ, వార్డు స్థాయిలో పార్టీ శ్రేణులను చైతన్యం చేయడంపై నాయకులు దృష్టి సారించాలని కోరారు. కూటమి నాయకులతో సమన్వయం, పార్టీలో క్రమశిక్షణ, సేవా దృక్పథంతో వ్యవహరించడం ద్వారా ప్రజల్లో పార్టీపై నమ్మకాన్ని మరింత బలపరచాలని సూచించారు. కూటమిలోని పార్టీలతో మాట్లాడి పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అదే విధంగా ట్రస్ట్ బోర్డ్ కమిటీలను కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ సమీక్షలో పార్టీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ, వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. పిపిపి విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం వల్ల పేదలకు నాణ్యమైన వైద్యం అందడంతో పాటు పేద విద్యార్ధులకు మెరుగైన విద్య అందుతుందన్నారు. శరవేగంగా మెడికల్ కాలేజీలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అసత్యాలతో అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొంథా తుఫాను సమయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు, ప్రజలకు అండగా నిలబడితే జగన్మోహన్ రెడ్డి విషం చిమ్ముతున్నాడన్నారు.

Related Post