hyderabadupdates.com movies వైసీపీ నేత‌ల‌కు మ‌ళ్లీ జైలుకే … ‘లిక్క‌ర్’ కేసు పాట్లు!

వైసీపీ నేత‌ల‌కు మ‌ళ్లీ జైలుకే … ‘లిక్క‌ర్’ కేసు పాట్లు!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన లిక్క‌ర్ కుంభ‌కోణంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ విచార‌ణ ఖైదీలుగా ఉన్న నాయ‌కుల‌ను మ‌ళ్లీ జైలుకు త‌ర‌లిస్తూ.. విజ‌య‌వాడ కోర్టు తీర్పు ఇచ్చింది. 2019-24 మ‌ధ్య వైసీపీ హ‌యాంలో నూత‌న మ‌ద్యం విధానాన్ని అమ‌లు చేశారు. ఆ స‌మ‌యంలో డిస్టిల‌రీల నుంచి భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నార‌ని, నాసిర‌కం మ‌ద్యం విక్ర‌యించి.. ప్ర‌జ‌ల‌ను దండుకున్నార‌ని.. ఈ క్ర‌మంలో 3500 కోట్ల రూపాయ‌ల అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని ప్ర‌భుత్వం గుర్తించింది.

ఈ క్ర‌మంలోనే ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి.. దీనిపై విచార‌ణ చేయిస్తోంది. ఈక్ర‌మంలో వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి, ఆ పార్టీ సానుభూతి ప‌రుడు, గ‌తంలో ఐటీ స‌ల‌హాదారుల‌గా వ్య‌వ‌హ‌రించిన రాజ్ క‌సిరెడ్డి స‌హాప‌లువురిపై కేసు న‌మోదైంది. దీంతో వారిని విచారించిన అధికారులు కోర్టు ఆదేశాల‌తో జైలుకు త‌ర‌లించారు. దాదాపు 5-6 మాసాలుగా వారు విజ‌య‌వాడ లోని జిల్లా స్థాయి జైల్లోనే కాలం గ‌డుపుతున్నారు. అయితే..తమ‌కు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతున్నా.. ఫ‌లితం ద‌క్క‌డం లేదు.

తాజాగా .. విజ‌య‌వాడ‌, గుంటూరు జైల్లో ఉన్న నిందితులు చెవిరెడ్డి, బూణేటి చాణక్య‌, రాజ్ క‌సిరెడ్డి, స‌జ్జ‌ల శ్రీధ‌ర్‌రెడ్డి స‌హా ప‌లువురి రిమాండ్ గ‌డువు ముగియ‌డంతో విజ‌య‌వాడ‌లోని కోర్టులో వారిని హాజ‌రు ప‌రిచారు. ఈ క్ర‌మంలో వారిని విచారించిన కోర్టు.. తిరిగి 14 రోజ‌లు రిమాండ్‌.. (అంటే డిసెంబ‌రు 5వ తేదీ వ‌ర‌కు) విధించింది. అయితే.. వీరిలో కొంద‌రికి ఆటోమేటిక్‌గానే బెయిల్ ల‌భించింది. దీంతో వారిపై తిరిగి పిటిష‌న్ వేయాల‌ని సిట్ అదికారులు నిర్ణ‌యించారు. ఫ‌లితంగా.. వారు కూడా మ‌ళ్లీ జైలుకే ప‌రిమితం కానున్నారు.

ఇక‌, ప్ర‌స్తుతం విచార‌ణ కొన‌సాగుతున్నా.. దీనిలో కీల‌క నిందితులు ఇంకా విదేశాల్లోనే ఉన్నార‌ని సిట్ చెబుతోంది. మ‌రోవైపు ఈ కేసులో అరెస్ట‌యి జైలుకు వెళ్లి.. ఇటీవ‌ల బెయిల్ ద‌క్కించుకున్న ఎంపీ మిథున్ రెడ్డిని మ‌రోసారి విచారించే అవ‌కాశం ఉంద‌ని అధికార వ‌ర్గాలు తెలిపాయి.

Related Post