వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలకు సుప్రీం కోర్టులో భారీ షాక్ తగిలింది. వారు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను రద్దు చేయడంతో పాటు.. వారిని అరెస్ట్ చెయ్యడానికి ఎటువంటి అడ్డు లేదని తేల్చి చెప్పింది. వారికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అనుసరించిన విధానాలు కూడా సరిగాలేదని ఆక్షేపణ వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తులో పోలీసులు వ్యవహరించిన తీరు సంతృప్తికరంగానే ఉందని స్పష్టం చేసింది.
అయితే.. పిన్నెల్లి సోదరులను తక్షణమే అరెస్టు చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడిన సుప్రీం కోర్టు ధర్మాసనం.. రెండు వారాల సమయం ఇస్తున్నట్టు తెలిపింది. నేటి(శుక్రవారం) నుంచి 2 వారాల్లోగా వారు పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశిస్తూ.. వారికి సమయం ఇచ్చింది. ఇలాంటి కేసుల్లో ముందస్తు బెయిల్‌పై నిందితులు ఉండడం సరికాదని.. ఇలా జరిగితే.. కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించిన కోర్టు.. వారి ముందస్తు బెయిల్‌ను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ సందీప్ మెహతా ఆదేశాలు జారీ చేశారు.
ఏం జరిగింది?
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో ఈ ఏడాది మే 25న ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. వెల్దుర్తి మండలం బోదలవీడు వద్ద గుండ్లపాడుకు చెందిన కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు గతంలో వైసీపీలో ఉండేవారు. పిన్నెల్లికి అనుకూలంగా వ్యవహరించారు. అయితే.. రాష్ట్రంలో టీడీపీకూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. వారు పార్టీ మారి టీడీపీలోకి చేరారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే 25న వారుతెలంగాణలోని హుజూర్ నగర్‌లో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి బైకు మీద వస్తున్న క్రమంలో కొందరు వ్యక్తులు స్కార్పియోతో ఢీకొట్టి దారుణంగా హత మార్చారు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఏ1 గా జవిశెట్టి శ్రీను, ఏ2గా తోట వెంకటరావు, ఏ3 గా తోట గురువయ్య, ఏ4 గా నాగరాజు, ఏ5గా తోట వెంకటేశ్వర్లను పేర్కొన్నారు. ఇదే సమయంలో వీరిని ప్రలోభానికి గురి చేసి హత్యకు ప్రేరేపించారన్న కారణంగా ఏ6గా మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ7గా ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి పేర్లను చేర్చారు. అయితే.. కేసు నమోదయ్యాక వారు ముందస్తు బెయిల్ పొందారు. తాజాగా ముందస్తు బెయిల్‌ను రద్దు చేయడంతోపాటు వారిని కస్టడీలోకి తీసుకుని విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.