hyderabadupdates.com movies శుభాభినంద‌న‌ల‌తో…. : సీఎం చంద్ర‌బాబుకు జ‌గ‌న్ లేఖ‌!

శుభాభినంద‌న‌ల‌తో…. : సీఎం చంద్ర‌బాబుకు జ‌గ‌న్ లేఖ‌!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. తాజాగా సీఎం చంద్ర‌బాబు సుదీర్ఘ లేఖ రాశారు. అయితే.. వాస్త‌వానికి సీఎం చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డే జ‌గ‌న్‌.. ఈ లేఖ‌ను మాత్రం ఒక ప‌ద్ధ‌తిగా “శుభాభినందనలతో” అంటూ.. ప్రారంభించ‌డం విశేషం. అయితే.. లేఖ లోప‌ల మాత్రం ఒకింత విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. ఈ లేఖ సారాంశం.. జ‌ల వివాదాలు.. జ‌ల స‌మ‌స్యల‌పైనే కావ‌డం విశేషం. గోదావ‌రి జ‌లాల‌పై ప్ర‌భుత్వం స‌రైన వాద‌న‌లు వినిపించ‌డం లేద‌ని.. అదేవిధంగా కృష్ణాజలాల విష‌యం లోనూ హ‌క్కులు కాపాడుకోలేక పోతోంద‌ని.. జ‌గ‌న్ పేర్కొన్నారు. మొత్తంగా కూట‌మిప్ర‌భుత్వం ఏర్ప‌డిన 17 నెల‌ల తర్వాత‌.. జ‌గ‌న్ లేఖ రాయ‌డం గ‌మ‌నార్హం.

ఇవీ లేఖ‌లో విశేషాలు..

శుభాభినందనలతో కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకు రావాలని భావిస్తున్నాను. కృష్ణా జలాల వినియోగంలో రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలు కాపాడడంలో కూటమి ప్రభుత్వం ఏ మాత్రం చిత్తశుద్ధితో పని చేయకపోవడం చాలా బాధాకరం. కృష్ణా జలాల వివాదాల పరిష్కారం కోసం జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ నేతృత్వంలో ఏర్పాటైన కృష్ణా జల వివాదాల 2వ ట్రైబ్యునల్‌ (కెడబ్ల్యూడీటీ–2) ఎదుట రాష్ట్ర ప్రభుత్వం చాలా పేలవమైన వాదనలు వినిపిస్తోంది. కెడబ్ల్యూడీటీ–2కి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అనిల్‌కుమార్‌ గోయల్‌ సమర్పించిన అఫిడవిట్‌ అందుకు ఒక ఉదాహరణ. ఇంకా కెడబ్ల్యూడీటీ–2 ఎదుట వాదనల సమయంలో తెలంగాణ ప్రభుత్వ పక్షాన వాదించిన న్యాయవాది వైద్యనాథన్, క్రాస్‌ ఎగ్జామినేషన్‌ సందర్భంగా ఏకే గోయల్‌ ఇచ్చిన సమాధానాలు, స్పందించిన తీరు అతి దారుణం. ఇది కృష్ణా జలాలపై మనకున్న హక్కు, ఆ జలాలు వాడుకోవడంలో ఈ కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం లేని చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోంది. అది ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

ప్రస్తుతం ఉన్న చట్టబద్ధ స్థితి ప్రకారం బచావత్‌ ట్రైబ్యునల్‌ (కెడబ్ల్యూడీటీ–1) నాడు తీసుకున్న నిర్ణయం, ఇచ్చిన ఆదేశం సుప్రీంకోర్టు తీర్పుతో సమానం. అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం అక్టోబరు 6, 2023న జారీ చేసిన అదనపు ఉల్లేఖన నిబంధనల (టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌–టీఓఆర్‌)కు అనుగుణంగా, కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి నాడు కెడబ్ల్యూడీటీ–1 ఇచ్చిన ఆదేశాలపై ఇప్పుడు కెడబ్ల్యూడీటీ–2 విచారణ జరుపుతోంది. కృష్ణా నదిలో లభ్యమయ్యే నికర జలాలు 811 టీఎంసీల (75 శాతం లభ్యత) కేటాయింపునకు సంబంధించి కెడబ్ల్యూడీటీ–2 విచారణ కొనసాగిస్తోంది. దీనిపై కెడబ్ల్యూడీటీ–2 ఎదుట గత సెప్టెంబరు 23, 24 తేదీల్లో వాదనలు కొనసాగాయి.

కృష్ణా జల్లాలో కచ్చితంగా 763 టీఎంసీల నీరు కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, అదే వాదన కెడబ్ల్యూడీటీ–2 ఎదుట బలంగా వినిపిస్తోంది. ఒకవేళ అదే కనుక జరిగితే, మ‌న రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగినట్లే. కాగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా తుది వాదనలు వినిపించే అవకాశం ఉంది కాబట్టి, కృష్ణా జలాలపై హక్కు కాపాడుకోవడానికి, ఆ నీటి వినియోగానికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ట్రైబ్యునల్‌ ఎదుట వినిపిస్తున్న కొన్ని వాదనలు చట్టపరిమితిని మించడం ఆందోళన కలిగిస్తోంది.

ఏపీ పునర్విభజన చట్టం–2014లోని 11వ షెడ్యూల్, క్లాజ్‌–4 ప్రకారం, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులకు, నదీ జలాల ధర్మాసనాలు కేటాయించిన నీరు యథాతథంగా కొనసాగాల్సి ఉంది. ఆ మేరకు కృష్ణా జలాల్లో ఈ ప్రాంతానికి కెడబ్ల్యూడీటీ–1 కేటాయించిన 811 టీఎంసీలు యథావిథిగా కొనసాగాల్సి ఉంది. ఆ ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల్లో మార్పు ఉండకూడదు.

అయినప్పటికీ అంతర్‌ రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956లోని సెక్షన్‌ 6(2), ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం–2014లోని 11వ షెడ్యూల్‌ను కాదని, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అక్టోబరు 6, 2023న మరిన్ని ఉల్లేఖన నిబంధనలు (టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌–టీఓఆర్‌) జారీ చేస్తూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అవిభాజిత వాటాగా ఉన్న నీటిని పరిగణలోకి తీసుకుంటూ, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల కేటాయింపును సమీక్షించాలని ట్రైబ్యునల్‌ను ఆదేశించింది. వెంటనే దాన్ని సవాల్‌ చేస్తూ, అప్పటి వైసీపీ ప్రభుత్వం, అక్టోబరు 9, 2023న సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ తర్వాత జూన్‌ 12, 2024న ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం, సుప్రీంకోర్టులో సరైన వాదనలు వినిపించలేదు.

ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశానికి అనుగుణంగా కృష్ణా జలాల కేటాయింపునకు సంబంధించి విచారణ చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు, తమ తీర్పునకు అనుగుణంగా తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలకు అనుగుణంగా ఆగస్టు 27, 2024న కెడబ్ల్యూడీటీ–2 విచారణ మొదలుపెట్టింది. కృష్ణా జలాల పున:పంపిణీకి సంబంధించి ముందుగా ఇరు రాష్ట్రాల వాదనలు వింటామని కెడబ్ల్యూడీటీ–2 వెల్లడించింది.

ఈ విషయంలో రాష్ట్ర పునర్విభజన చట్టం–2014లోని అంశాలతో ప్రమేయం లేకుండా, కేంద్ర జలశక్తి శాఖ అక్టోబరు 6, 2023న జారీ చేసిన అదనపు ఉల్లేఖన నిబంధనలకు అనుగుణంగా వాదనలు వింటామని ఆగస్టు 29, 2024న ప్రకటించింది. మొత్తం 36 అంశాలకు సంబంధించి రెండు రాష్ట్రాల సమ్మతికి అనుగుణంగా కృష్ణా జలాల నికర పున:పంపిణీపై విచారణ జరుపుతామని కెడబ్ల్యూడీటీ–2 వెల్లడించింది. ఈ విష‌యంలోనూ వాదనల‌ను బలంగా వినిపించడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విఫలమవుతోంది. ఇది చాలా దురదృష్టకరం. వీటన్నింటి నేపథ్యంలో రాష్ట్ర ప్రజల తాగు, సాగునీటి అవసరాలు తీరేలా నీటిలో మన హక్కు అయిన వాటా కోసం మీరు చిత్తశుద్ధితో పని చేయాలని, ఆ విధంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని కోరుతున్నాను.

Related Post