తిరుమల : తిరుమలలో ఫిబ్రవరి 1వ తేదిన జరగనున్న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై టిటిడి అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడారు. తిరుమలలో జరిగే అతి ముఖ్యమైన తీర్థ ఉత్సవాలలో ఒకటైన రామకృష్ణతీర్థ ముక్కోటికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
భక్తుల కోసం షామియానా, రేడియో బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా ప్రకటనలు, డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. టీటీడీ భద్రతా సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. భక్తుల సౌకర్యార్థం భద్రత, అన్నప్రసాదం, తాగునీరు, వైద్యం, ఆరోగ్యం, అటవీ విభాగాల ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. పాప వినాశనం వద్ద భక్తులకు అన్నప్రసాదం పంపిణీకి అవసరమైన శ్రీవారి సేవకులను నియమించాలని కోరారు.
అధిక బరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న యాత్రికులను, చిన్న పిల్లలను అనుమతించబోమని తెలియజేశారు. పాప వినాశనం వద్ద భక్తులను మెడికల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే తీర్థానికి అనుమతించాలని చెప్పారు. భక్తులకు అత్యవసర పరిస్థితిలో చికిత్స అందించేందుకు రెండు అంబులెన్సులు, 4 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ప్రైవేట్ వాహనాలు, ద్విచక్ర వాహనాలను ఫిబ్రవరి 1వ తేదిన పాప వినాశనానికి అనుమతించని కారణంగా గోగర్భం డ్యామ్ పాయింట్ నుండి పాపవినాశనం వరకు యాత్రికులను తరలించేందుకు ఏపీఎస్ఎస్ఆర్టీసీ నుండి బస్సులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే యాత్రికులను ఈ తీర్థానికి అనుమతించనున్నట్లు తెలిపారు.
The post శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి కోసం భారీ ఏర్పాట్లు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి కోసం భారీ ఏర్పాట్లు
Categories: