2026 సంక్రాంతి పండగకు బాక్సాఫీస్ యుద్ధం మహా రంజుగా ఉండబోతోంది. మాములుగా అయితే జానర్లు వేర్వేరుగా ఉండి ఎవరి అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకోవడం చాలాసార్లు చూశాం. కానీ ఈసారి అన్నీ ఎంటర్ టైన్మెంట్ ని ఆధారంగా చేసుకుని ఫ్యామిలీ ఆడియన్స్ ని బలంగా టార్గెట్ పెట్టుకుంటున్నాయి. పోటీ సంగతి పక్కన పెడితే టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు నాలుగింటి నుంచి నాలుగు మొదటి పాటలు వచ్చేశాయి. ఇలాంటి కాంపిటీషన్ లో పోలిక సహజం కాబట్టి ఎవరి పాటలకు ఎక్కువ చప్పట్లు పడుతున్నాయనే కంపారిజన్ వచ్చేస్తుంది. అందరికంటే అడ్వాన్స్ గా చాలా ముందు వచ్చింది మన శంకరవరప్రసాద్ గారు.
ప్యాన్ ఇండియా ఫ్లేవర్ లేకుండా కేవలం ఒక్క బాషలోనే ‘మీసాల పిల్ల’ డెబ్భై మిలియన్ల వ్యూస్ దాటేసి చికిరి చికిరి తర్వాత సోషల్ మీడియాలో అంత రీచ్ తెచ్చుకున్న పాటగా దీని మీద లక్షల్లో రీల్స్, పోస్టులు పడ్డాయి. ఒకవేళ ఈ సాంగ్ కనక ఇంత రీచ్ తెచ్చుకోకపోయి ఉంటే బజ్ విషయంలో ఈ మెగా మూవీ ఖచ్చితంగా వెనుకబడి ఉండేది. భీమ్స్ సిసిరోలియో కంపోజింగ్ ఫస్ట్ క్లాస్ లో పాసయ్యింది. నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు నుంచి వచ్చిన ‘భీమవరం బల్మా’ స్లో పాయిజన్ అవుతుందేమో చూడాలి. ఇన్స్ టాన్ట్ అయితే ఎక్కలేదు. మార్కెటింగ్ పరంగా మరింత ముందుకు తీసుకెళ్లే ప్లాన్ లో టీమ్ ఉంది.
ఇక అందరూ ఎదురు చూసిన రాజా సాబ్ ‘టైటిల్ ట్రాక్’ అభిమానుల నుంచే ఎక్స్ ట్రాడినరి అనిపించుకోలేకపోయిన మాట వాస్తవం. తమన్ కంపోజింగ్ మీద కామెంట్స్ ఎక్కువగానే వచ్చాయి. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి తాజాగా బయటికొచ్చిన్న ‘బెల్లా బెల్లా’ అంటూ హీరోయిన్ ఆశికా రంగనాథ్ తో చేసిన డ్యూయెట్ కొంచెం రెగ్యులర్ టచ్ లోనే ఉంది. మెల్లగా ఎక్కుతుందేమో చూడాలి. డబ్బింగుల విషయానికి వస్తే జన నాయకుడు తెలుగు వర్షన్ పాట ఇంకా రాలేదు. పరాశక్తి వచ్చింది కానీ జనంలో దాని ఊసు వినిపించడం లేదు. మొత్తానికి ఈ పాటల మధ్య గ్యాప్ ఉందనేది నిజమే కానీ చప్పట్లు ఎక్కువ వచ్చింది మాత్రం మీసాల పిల్లకే.