సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. భారతదేశంలో భాగం కాని సింధ్ ప్రాంతం భవిష్యత్తులో భారత్ లో భాగమవుతుందన్న ఆయన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. సింధ్ ప్రాంతం ప్రస్తుతం పాకిస్థాన్ లో భాగమన్న సంగతి తెలిసిందే. సింధ్ ప్రాంతంలోని వారిని పాకిస్థాన్.. విదేశీయుల మాదిరి చూస్తుందని.. భారతప్రజలు మాత్రం వారిని విదేశీయుల మాదిరి కాకుండా సొంత మనుషుల్లా పరిగణిస్తున్నట్లు చెప్పారు.
హిందువులు సింధు నదిని పవిత్రంగా భావించేవారని.. ఇప్పుడు ఆ ప్రాంతం భారత్ భాగం కానప్పటికీ.. నాగరికత ప్రకారం ఎల్లప్పుడు మన దేశంలో భాగంగా ఉంటుందని పేర్కొన్నారు. “ఈ ప్రాంతం నేడు భారత్ లో భాగం కాకపోయినా.. ఇక్కడి నాగరికత వారసత్వంతో ఇప్పటికి ముడిపడి ఉంది. సరిహద్దులు మారొచ్చు. 1947లో దేశ విభజన అనంతరం పాక్ లో భాగమైన సింధ్.. భవిష్యత్తులో తిరిగి భారత్ లో కలవొచ్చు” అని వ్యాఖ్యానించారు. సింధీ హిందువులని.. ముఖ్యంగా తన తరం వారు సింధ్ ను భారత్ నుంచి వేరుచేయటాన్ని ఇప్పటికీ అంగీకరించలేదని బీజేపీ అగ్రనేత ఎల్ కే ఆడ్వాణీ రాసిన ఒక పుస్తకంలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.
“సరిహద్దులు మారొచ్చు. ఎవరికి తెలుసు. భవిష్యత్తులో సింధ్ మళ్లీ మన దేశంలో కలవొచ్చు. సింధీ ప్రజలు ఎక్కడున్నా.. ఎల్లప్పుడు వాళ్లు మనవాళ్లే” అంటూ రాజ్ నాథ్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఢిల్లీలో జరిగిన సింధీ సమాజం కార్యక్రమంలో పాల్గొన్న రాజ్ నాథ్ ప్రసంగించిన సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.