టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి.. తమిళ అగ్ర కథానాయకుడు విజయ్‌తో చేసిన వారిసు (తెలుగులో వారసుడు) సినిమా రిలీజై మూడేళ్లు కావస్తోంది. కానీ ఇప్పటిదాకా తన కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. మహర్షి తర్వాత టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు షిఫ్ట్ అయిన అతను.. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టాడు. ఆమిర్ ఖాన్‌తో ఓ సినిమా కోసం గట్టిగా ట్రై చేశాడు. కానీ వర్కవుట్ కాలేదు. అలా అని అతనేమీ బాలీవుడ్ ఖాళీ చేసి తిరిగి టాలీవుడ్‌కు వచ్చేయలేదు.
అక్కడే ఉండి ఇంకో టాప్ స్టార్‌ను ట్రై చేశాడు. అతనే… సల్మాన్ ఖాన్. ఈ కండల వీరుడితో వంశీ సినిమా ఓకే అయినట్లే కనిపిస్తోంది. వంశీతో వరుసగా సినిమాలు నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లోనే ఈ సినిమా కూడా తెరకెక్కబోతోంది. ఈ విషయాన్ని ఎస్వీసీ అధినేతల్లో ఒకరైన శిరీష్ ధ్రువీకరించారు. గోవాలో జరుగుతున్న ఇఫీ ఫిలిం ఫెస్టివల్‌కు హాజరైన శిరీష్.. వంశీ-సల్మాన్ సినిమా ఓకే అయిందని.. త్వరలోనే దాని గురించి అధికారిక ప్రకటన వస్తుందని తెలిపారు.
మరోవైపు వకీల్ సాబ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఇంకో సినిమా కోసం జరుగుతున్న ప్రయత్నాలను కూడా శిరీష్ ధ్రువీకరించారు. పవన్‌తో సినిమా ఉంటుందని.. ఎప్పుడు ఏంటి, ఎవరు దర్శకుడు అన్నది త్వరలోనే తెలుస్తుందని ఆయన చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.
తమ సంస్థలో ప్రస్తుతం 8 సినిమాల దాకా ప్లానింగ్‌లో ఉన్నాయని.. ఇందులో కనీసం అరడజను సినిమాలు వచ్చే ఏడాది రిలీజవుతాయని శిరీష్ తెలిపారు. కొన్నేళ్లుగా ఆశించిన ఫలితాలు అందుకోలేకపోతున్న ఎస్వీసీ సంస్థ.. వచ్చే ఏడాది పూర్వ వైభవం చూస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది సంక్రాంతికి గేమ్ చేంజర్ రూపంలో ఎస్వీసీకి పెద్ద షాక్ తగలగా.. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ అయి ఆ నష్టాన్ని భర్తీ చేసింది. కానీ ఏడాది మధ్యలో తమ్ముడు రూపంలో మరో పెద్ద షాక్ తగిలింది ఆ బేనర్‌కు.