ప్రముఖ కవి, తెలంగాణ ఉద్యమ గళం అందెశ్రీ అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆ కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి దశ వరకు స్వయంగా పర్యవేక్షిస్తూ, అందెశ్రీ కుటుంబానికి అండగా నిలిచారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. స్వయంగా సీఎం పాడెను మోసి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అందెశ్రీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
సుదీర్ఘ తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో అందెశ్రీ ప్రజల్లో చైతన్యం రగిలించిన వ్యక్తి అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఆయనను ఇంటర్వ్యూ చేసే అవకాశం తానందుకున్నానని, ఇద్దరం అనేక సందర్భాల్లో వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిపారు.
అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించడం గౌరవకరమైన నిర్ణయమని గుర్తు చేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆ గీతాన్ని అన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చుతామని సీఎం ప్రకటించారు.
“ప్రతి విద్యార్థి జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆలపించేలా చేస్తాం. పాఠ్యాంశంలో చేర్చడం ద్వారా తెలంగాణ నేలపై అందెశ్రీ కవితలు ఎల్లప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. అదే ఆయనకు నిజమైన ఘన నివాళి” అని సీఎం అన్నారు.
అలాగే అందెశ్రీ రచించిన నిప్పులవాగు పుస్తకాన్ని రాష్ట్రంలోని అన్ని చిన్న, పెద్ద గ్రంథాలయాల్లో అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. అందెశ్రీ కుటుంబాన్ని ఆదుకునేందుకు, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.