టాలీవుడ్ లో చాలా తక్కువ హీరోలు మనసుని, ఒంటిని బాగా కష్టపెట్టి సినిమాలు చేస్తారు. వాళ్లలో సుధీర్ బాబుని చేర్చొచ్చు. అలాని తనేదో బెస్ట్ పెరఫార్మర్ అని చెప్పడం కాదు ఉద్దేశం. తనవరకు లోపం లేకుండా విభిన్న కథలను ఎంచుకునే ప్రయత్నమైతే చేస్తూనే ఉన్నాడు. కాకపోతే లక్కు, సక్సెస్ రెండూ కలిసి రావడం లేదు. తాజాగా వచ్చిన జటాధరకు నెగటివ్ టాక్, రివ్యూస్ వచ్చేశాయి. హారర్, డివోషన్ మిక్స్ చేసి ఏదో చెప్పాలని చూసిన దర్శకులు టేకింగ్ లోపం, విఎఫెక్స్ క్వాలిటీ, స్క్రీన్ ప్లే సమస్య, ఎగుడుదిగుడు నెరేషన్ వల్ల ప్రేక్షకులకు కనీస స్థాయి అనుభూతినివ్వలేకపోయారు. విమర్శలకు గురయ్యారు.
ఈ మధ్య కాలంలో దేనికీ రానంత అన్యాయమైన రేటింగ్స్ జటాధరకు వచ్చాయి. దైవత్వం అంతర్లీనంగా ఉన్న సినిమాలకు గత కొన్నేళ్లుగా మంచి ఆదరణ దక్కుతోంది. అందులో డౌట్ లేదు. కార్తికేయ 2, కాంతార, మిరాయ్, కల్కి లాంటివి వందల కోట్లు వసూలు చేశాయి. అంత మాత్రానికే దాన్నే ట్రెండ్ గా భావించి ఎలివేషన్, ఎమోషన్ లేకుండా తీస్తే జనాలు ఆదరించరు. ఈ ప్రాధమిక సూత్రాన్ని మర్చిపోయి గుడ్డిగా వరల్డ్ బిల్డింగ్ పేరుతో ముందే రెండు భాగాలు అనేసుకుని జనాలను తక్కువంచనా వేసి ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తే ఇలాంటి తిరస్కారాలు తప్పవు. జటాధర ఋజువు చేస్తోంది ఇదే.
డిజాస్టర్లు అందరు హీరోలకు వస్తాయి కానీ వరసగా వస్తే మాత్రం మార్కెట్ రిస్క్ లో పడుతుంది. సుధీర్ బాబుకి మహేష్ ఫ్యాన్స్ సపోర్ట్ పెద్దగా ఏం లేదు. టాక్ బాగుంటే వస్తున్నారు తప్పించి ఓపెనింగ్ రోజే హౌస్ ఫుల్ చేయడం లేదు. ఇరవై సినిమాల ట్రాక్ రికార్డు ఉండి ఇప్పుడిలా స్ట్రగుల్ అవ్వడం కరెక్ట్ కాదు. కొన్నేళ్లలో వారసుడిని పరిచయం చేయాలని చూస్తున్న సుధీర్ బాబు ముందు తాను బలంగా ఒక మార్కెట్ ఏర్పరుచుకుంటే ఎంట్రీ టైంలో జూనియర్ కు ప్రయాణం ఈజీ అవుతుంది. తర్వాత దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తో సినిమా చేయబోతున్న సుధీర్ బాబు దాంతో అయినా తాను కోరుకున్న బ్రేక్ అనుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్ష.