ఏపీ సీఎం చంద్రబాబు వైసీపీ నేతలపై పరోక్షంగా సెటైర్లు గుప్పించారు. “నన్ను లైట్(తేలికగా) తీసుకున్నారు. సూపర్ సిక్స్ హామీలు ఇస్తే.. అవి అమలు కావని ప్రచారం చేశారు. కానీ.. సూపర్ సిక్స్ హామీలను సక్సెస్ చేశాం. దీంతో వాళ్లు లైట్(పలుచన) అయిపోయారు“ అని వ్యాఖ్యానించారు. తాజాగా ఏలూరు జిల్లాలో నిర్వహించిన ప్రజా సేవలో(ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ) పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించి.. ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
గత ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామని.. ప్రజలకు మేలు చేస్తామని చెప్పామని.. చెప్పినట్టుగానే 17 మాసాల్లోనే ఇచ్చిన ప్రతిహామీని అమలు చేసి చూపిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఇది రాష్ట్రంలో తప్ప మరెక్కడా జరగడం లేదని చెప్పారు. ఇప్పటి వరకు 50 వేల కోట్ల రూపాయలను సూపర్ సిక్స్ హామీల అమలు ఖర్చు చేసినట్టు వివరించారు. గత ఎన్నికల్లో ప్రజలు ఎంతో నమ్మకంగా కూటమిని గెలిపించారని చెప్పిన ఆయన.. ఆ నమ్మకాన్ని ప్రతివిషయంలోనూ నిలబెట్టు కుంటున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధికి కేంద్రంగా మార్పు చేసేదిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిపారు. పెట్టుబడుల ద్వారా పరిశ్రమలు వస్తాయని, తద్వారా ఉపాధి,ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు.
కేవలం పింఛన్ల కోసమే లక్ష కోట్ల రూపాయల మేరకు ఖర్చు చేయనున్నట్టు సీఎం తెలిపారు. సామాజిక భద్రతకు పెద్ద పీట వేస్తున్నామన్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత.. వారి జీవితాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని, ఏటా మూడుగ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నామని.. దీంతో పేదలపై ఆర్థిక భారం తప్పిందని చెప్పారు. జీఎస్టీ తగ్గింపు ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతోందన్నారు. ప్రజలు తమను గెలిపించినం దుకు ధన్యవాదలు చెబుతున్నామన్నారు. ఈ విజయం ఒక్కనాటితో సరిపోదన్న ఆయన.. అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలంటే.. ఒక్క ప్రభుత్వమే ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజల చెంతకే అభివృద్ధి..
గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న ప్రతి పనినీ ప్రజలకు వివరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సీఎం తెలిపారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో అభివృద్ధి వివరాలతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రైతులకు కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉందన్న ఆయన.. వీరి కోసం పంచ సూత్రాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. రైతన్నా మీ కోసం కార్యక్రమాన్ని అందుకే తీసుకువచ్చామని చెప్పారు. ప్రతి రైతు ఆర్థికంగా ఎదగాలన్న సంకల్పంతో మరిన్ని కార్యక్రమాలను త్వరలోనే అమలు చేయనున్నట్టు వివరించారు. త్వరలోనే పోలవరం కుడి కాల్వ ద్వారా నీటిని విడుదల చేయనున్నట్టు చంద్రబాబు హామీ ఇచ్చారు.