హీరోల కొడుకులు సాధారణంగా హీరోలే అవుతారు. మాస్ రాజా తనయుడు మహాధన్ మొదట నటనలోకే అడుగు పెట్టాడు. తన తండ్రి నటించిన రాజా ది గ్రేట్ సినిమాలో చిన్నప్పటి రవితేజ పాత్రలో ఆకట్టుకున్నాడు ఆ కుర్రాడు. కానీ తర్వాత అతను మరే సినిమాలోనూ నటించలేదు. చదువు మీద ఫోకస్ చేశాడు. ఐతే అంతిమంగా మహాధన్ హీరోయే కావచ్చేమో కానీ.. ఈ లోపు సినిమాకు సంబంధించి అన్ని విభాగాల మీద అతను అవగాహన పెంచుకునే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తోంది.
ఈ క్రమంలోనే మహాధన్ ఒక పెద్ద సినిమాకు దర్వకత్వ విభాగంలో పని చేస్తున్న విషయం వెల్లడైంది. సూర్య కథానాయకుడిగా వెంకీ అట్లూరి తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు మహాధన్. ఈ విషయాన్ని వెంకీనే స్వయంగా వెల్లడించాడు. రవితేజతో కలిసి అతను మాస్ జాతర సినిమాకు సంబంధించి ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా మహాధన్.. సూర్య సినిమాకు దర్శకత్వ విభాగంలో పని చేస్తున్నట్లు తెలిపాడు. మరి తన కొడుకు ఎలా ఉన్నాడు అని అడిగితే.. మీరు ఎలా పెంచారో అలాగే ఉన్నాడు సార్ అంటూ నవ్వేశాడు వెంకీ.
రవితేజతో మాస్ జాతర సినిమాను ప్రొడ్యూస్ చేసిన నాగవంశీనే.. సూర్య-వెంకీ మూవీని కూడా నిర్మిస్తున్నాడు. దీంతో ఆ సినిమా కోసం మహాధన్‌ను ఏడీగా తీసుకుని అతడికి పని నేర్పిస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ కూడా కెరీర్ ఆరంభంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయడం.. ఆ తర్వాత నటనలోకి అడుగు పెట్టి హీరోగా పెద్ద రేంజికి వెళ్లడం తెలిసిందే. మరి తండ్రి బాటలో అడుగులు వేస్తున్న మహాధన్.. హీరోనే అవుతాడా, లేక మధ్యలో దర్శకత్వం వైపు ఏమైనా చూస్తాడా అన్నది భవిష్యత్తులోనే తేలుతుంది. మాస్ జాతర ఈ నెల 31న విడుదల కానుండగా.. వెంకీ అట్లూరి-సూర్య మూవీ వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.