ఐపీఎల్‌లో సిక్సర్ల మోత మోగించే మన ‘స్టార్లు’ ఇవాళ బంగ్లాదేశ్ కుర్రాళ్ళ ముందు చతికిలపడ్డారు. కోట్లు పలికే మన ప్లేయర్లు, కనీసం ఒక్కటంటే ఒక్క పరుగు కూడా చేయకుండా సూపర్ ఓవర్‌లో ఫ్లాప్ అయ్యారు. అసలు స్కోర్ బోర్డు చూస్తే షాక్ అవ్వాల్సిందే. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 194/6 భారీ స్కోరు చేసింది. మనోళ్లు కూడా సరిగ్గా 194/6 కొట్టి మ్యాచ్‌ను ‘టై’ చేశారు. అది కూడా చివర్లో బంగ్లా చేసిన పొరపాటు కారణంగా టీమిండియాకి ఛాన్స్ దొరికింది. అంతా బాగుంది అనుకుంటే, సూపర్ ఓవర్ అనే లాటరీలో అట్టర్ ప్లాప్ అయ్యారు.
ఛేజింగ్ మొదలుపెట్టినప్పుడు మనోళ్లు ఈజీగా గెలిచేస్తారనిపించింది. ప్రియాంశ్ ఆర్య (44), వైభవ్ సూర్యవంశీ (38) దంచి కొట్టారు. కానీ మధ్యలో, వరుసగా వికెట్లు పారేసుకున్నారు. గెలవాల్సిన మ్యాచ్‌ను కష్టాల్లోకి నెట్టేశారు. చివర్లో జితేష్ శర్మ (33), నెహాల్ వధేరా (32) పోరాడినా ఫలితం లేకపోయింది. ఎలాగోలా కష్టపడి మ్యాచ్‌ను ‘టై’ చేసి, లక్కుతో సూపర్ ఓవర్ దాకా తెచ్చారు.
సరే, ఇక్కడైనా మన ఐపీఎల్ అనుభవం పనికొస్తుందనుకుంటే.. అసలు సినిమా అక్కడ మొదలైంది. సూపర్ ఓవర్ అంటే ఆరు బంతులు, దడ పుట్టించే టెన్షన్. కానీ మనోళ్లు దాన్ని కామెడీ చేశారు. బ్యాట్ పట్టుకుని దిగారు, రెండు బంతులు ఆడారు, రెండు వికెట్లు ఇచ్చేశారు. సూపర్ ఓవర్ స్కోర్: ఇండియా 0/2.
సరే, బ్యాటింగ్లో సున్నా చుట్టారు.. కనీసం బౌలింగ్లో అయినా ఆ ఒక్క పరుగును కాపాడతారా అంటే.. అక్కడ మరో ట్విస్ట్. మన బౌలర్ సుయాష్ శర్మ మొదటి బాల్ లో వికెట్ తీసినా ఆ తరువాత ఏకంగా ‘వైడ్’ వేసి శుభం కార్డు వేశాడు.
బంగ్లాదేశ్ సూపర్ ఓవర్ స్కోర్: 1/0 (వైడ్). బ్యాటర్లు కష్టపడకుండానే గెలిచేశారు. అటు బ్యాటింగ్‌లో డకౌట్, ఇటు బౌలింగ్‌లో వైడ్.. ఇంతకంటే దారుణమైన ఓటమి ఇంకోటి ఉండదు. మొన్న పాకిస్థాన్ చేతిలో కూడా దారుణమైన ఓటమే. ఇక, ఇవాళ బంగ్లాదేశ్ చేతిలో ఇలా ‘సూపర్’ ఓటమి పాలయ్యారు.