ఏపీ ప్రభుత్వంపై నిత్యం సోషల్ మీడియాలో విషం కక్కుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిలో భాగంగా ఐదుగురు మంత్రులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. వాస్తవానికి ప్రభుత్వం చేస్తున్న మంచిని కూడా చెడుగా చూపిస్తూ.. సోషల్ మీడియాలో కామెంట్లు, పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఒకానొక దశలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు, వ్యతిరేక వార్తలపై తీవ్ర కలవరం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని అడ్డుకోవాల్సిం దేనన్నారు.
కేవలం ప్రభుత్వం చేస్తున్న పనులపైనే కాదు.. నాయకుల కుటుంబాలు, నాయకులపై కూడా.. తీవ్ర విమర్శలు, దూషణలు చేస్తూ.. పోస్టులు పెడుతున్నారన్నది వాస్తవం. ఈ క్రమంలో అరెస్టులు కూడా చేస్తున్నారు. కానీ, సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు, ఉత్తర్వులు వంటివి సర్కారుకు ఇరకాటంగా మారాయి. సోషల్ మీడియాను భావప్రకటనా స్వేచ్ఛగా ప్రకటించిన సుప్రీంకోర్టు.. దీనిపై చర్యలు తీసుకోవద్దని.. ఎవరినీ అరెస్టులు చేయొద్దని కూడా ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. దీంతో రాష్ట్ర హైకోర్టు కూడా.. సోషల్ మీడియా ఆధారంగా కేసులు పెడుతున్నవారిని వదిలేయాలని.. ఇకపై కేసులు నమోదు చేసే ముందు.. డీసీపీ స్థాయి అధికారులు పర్యవేక్షించాలని కూడా సూచించింది. ఈ పరిణామాలతో సోషల్ మీడియాలో మరింత కొందరు రెచ్చిపోతున్నారు.
ఈ విషయాలపై అధ్యయనం చేసేందుకు, సోషల్ మీడియా దూకుడుకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఐదుగురితో కూడిన మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. సభ్యులుగా మంత్రులు అనిత, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, పార్థసారథి ఉంటారు. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం జీవో పాస్ చేసింది. దీని ప్రకారం.. ఈ కమిటీ.. సోషల్ మీడియా అకౌంటబిలిటీ, కంటెంట్ నియంత్రణపై ఫోకస్ చేస్తుంది. అదేసమయంలో తప్పుడు ప్రచారం, మిస్ఇన్ఫర్మేషన్‌పై నిఘా పెట్టనుంది. అంతర్జాతీయ బెస్ట్ ప్రాక్టీసులపై అధ్యయనం చేయనున్న కమిటీ.. తప్పుడు ప్రచారం, మిస్ఇన్ఫర్మేషన్, నేషనల్ సెక్యూరిటీ ముప్పులపై చర్యలకు సిఫారసులు చేయనుంది.
అదేసమయంలో సాధారణ పౌర హక్కుల పరిరక్షణకు కూడా ఈ మంత్రుల కమిటీ పలు సూచనలు ఇవ్వనుంది. అవసరమైతే నోడల్ ఏజెన్సీలు లేదా స్వతంత్ర పర్యవేక్షణ సంస్థలు ఏర్పాటు చేసేందుకు వీలుగా సిఫారసు చేసే అధికారం కూడా ఈ కమిటీకి ఇచ్చారు. సిఫారసులను వీలైనంత త్వరలో ప్రభుత్వానికి సమర్పించాలని తాజాగా విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ కమిటీకి మూడు మాసాల సమయం ఇచ్చారు. వారానికి ఒక్కసారైనా ఖచ్చితంగా భేటీ కావాలని.. సాధ్యమైనంత వేగంగా సిఫారసులు చేయాలని సూచించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను కూడా ఈ కమిటీ పరిశీలించి.. సోషల్ మీడియాదూకుడు కళ్లెం వేసేలా నిర్ణయాలు తీసుకోనుంది.