hyderabadupdates.com movies స్టార్లకు నటన నేర్పిన గురువు ఇక లేరు

స్టార్లకు నటన నేర్పిన గురువు ఇక లేరు

సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాంటి యాక్టింగ్ లెజెండ్స్ కి నటనలో శిక్షణ ఇచ్చిన గురువు ఇవాళ చివరి శ్వాస తీసుకున్నారు. ఆయన పేరు కెఎస్ నారాయణస్వామి. 1960 ప్రాంతంలో మదరాసు (ఇప్పటి చెన్నై) లో సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ నిర్వహించిన ఫిలిం ఇన్స్ టిట్యూట్ లో యాక్టింగ్ గురువుగా ఉండేవారు. అసలు పేరు కాకుండా ఈయన్ని కెఎస్ గోపాలిగా పిలిచేవారు. దూరదర్శన్ కేంద్రానికి డైరెక్టర్ గానూ పని చేసిన అనుభవముంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న కెఎస్ నారాయణస్వామి 92 సంవత్సరాల వయసులో చివరి శ్వాస తీసుకున్నారు.

ట్రైనింగ్ జరుగుతున్న టైంలో రజనీకాంత్ ని దర్శకుడు కె బాలచందర్ కు పరిచయం చేసింది నారాయణస్వామినే. అదే రజని జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. అపూర్వ రాగంగల్ లో ఇచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వాడుకుని తొలి ఛాన్సే సూపర్ హిట్ చేసుకున్నాడు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. తను హీరోగా రాణిస్తానా లేదా అనే అనుమానంతో అప్పుడప్పుడు కలత చెందుతున్న రజనీకాంత్ కి నారాయస్వామినే ధైర్యం నూరిపోసేవారట. విలన్ గా హీరోగా ఏ అవకాశం వచ్చినా వదలకుండా టాలెంట్ ప్రూవ్ చేసుకోమని ధైర్యం చెప్పడమే కాదు తొలి అవకాశం వచ్చేలా చేశారట.

ఈ అభిమానంతోనే రజనీకాంత్ స్వయంగా వెళ్లి నారాయణస్వామిని చివరిసారి చూసుకుని వచ్చారు. 70 నుంచి 90 దశకం మధ్యలో ఈయన దగ్గర ఓనమాలు దిద్దుకున్న లిస్టు చాలా పెద్దదే. స్వతహాగా రచయిత కూడా అయిన నారాయణస్వామి ఎందరో దర్శకులకు కీలక సూచనలు ఇచ్చి వాళ్ళ విజయాల్లో కీలక పాత్ర పోషించేవారు. దక్షిణాది పరిశ్రమకు హీరో హీరోయిన్ల రూపంలో లెక్కలేనంత ప్రతిభావంతులను అందించడంలో నారాయస్వామి చేసిన కృషి తర్వాతి రోజుల్లో ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఫిలిం ఇన్స్ టిట్యూట్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆయన ముద్ర అక్కడ శాశ్వతంగా ఉండిపోయింది.

Related Post