నిఖిల్ హీరోగా రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు ఎట్టకేలకు తుది ఘట్టానికి చేరుకుంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ పీరియాడిక్ డ్రామాకు భరత్ కృష్ణమాచారి దర్శకుడు. సుదీర్ఘ నిర్మాణం జరుపుకున్న ఈ విజువల్ గ్రాండియర్ విడుదల తేదీని సరికొత్త స్టైల్ లో ప్రకటించాడు నిఖిల్. ఒక ప్రత్యేక వీడియోని రూపొందించి అందులో టెక్నికల్ టీమ్ ని పరిచయం చేయడమే కాకుండా, తాము వేసిన సెట్లు, సృష్టించిన సరికొత్త ప్రపంచం, పడిన కష్టం, వందలాది ఆర్టిస్టులు పాల్గొన్న వైనం అన్నీ శాంపిల్ గా చూపించాడు. ఇంత జరిగిందా అనిపించేలా మేకింగ్ విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 మహా శివరాత్రి సందర్భంగా స్వయంభు విడుదల కానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. మంచి టైమింగ్ చూసుకుని తేదీని సెట్ చేసుకోవడంతో నార్త్ మార్కెట్ ని కూడా టార్గెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కార్తికేయ 2 ఇచ్చిన నేషన్ వైడ్ గుర్తింపు నిలబెట్టుకోవడానికి నిఖిల్ చాలా కష్టపడుతున్నాడు. దాని తర్వాత చేసినవి ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినా, రిలీజ్ ఎంత ఆలస్యమవుతున్నా స్వయంభు మీదే ప్రాణం పెట్టాడు. దానికి అనుగుణంగానే ఫలితం వస్తుందనే వైబ్ ఈ వీడియోలో ఉంది. సంయుక్త మీనన్, నభ నటేష్ హీరోయిన్లుగా నటించారు.
రవి బస్రూర్ సంగీతం, కెకె సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం, ఫాంటమ్ విఎఫ్ఎక్స్, తమ్మిరాజు ఎడిటింగ్ లాంటి అత్యున్నత సాంకేతిక వర్గం స్వయంభుకి పని చేసింది. చరిత్రలో చూపించని చెప్పని ఒక యుద్ధ వీరుడి గాధను ఈ సినిమాలో చెప్పబోతున్నారని నిఖిల్ వివరించాడు. తన గుర్రాన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేశాడు. అంచనాలు పెరిగేలా కట్ చేసిన విధానం బాగుంది. రిలీజ్ కు ఇంకో రెండున్నర నెలల సమయమే ఉంది కాబట్టి స్వయంభు టీమ్ ఇకపై ప్రమోషన్లను వేగవంతం చేయబోతున్నారు. రెగ్యులర్ గా కాకుండా కొత్త తరహాలో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అది నిజమేనని ఈ శాంపిల్ చూస్తే అర్థమైపోయిందిగా.