“హలో ఒక్క నిముషం.. ఏపీ కలల రాజధాని అమరావతి నిర్మాణాకి సంబంధించి సలహాలిస్తారా?“ అంటూ.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. నవ్యాంధ్ర రాజధానిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరి సహకారాన్ని కోరుతున్నట్టు ప్రకటించింది. నవ నగరాలు.. అద్భుతమైన భవనాలతో నిర్మితమవుతున్న అమరావతి.. హరిత పర్యావరణ వ్యవస్థ(ఎకో సిస్టమ్)కు ఆనవాలుగా మారుతుందని తెలిపింది. ఇది కేవలం రాజధాని నగరమే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వామ్య నగరంగా కూడా మారనుందని ప్రభుత్వం పేర్కొంది.
ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని చేపట్టిన క్రమంలో అందరినీ భాగస్వామ్యం చేసేందుకు ప్రభుత్వం సంకల్పించిందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ దీనిలో భాగస్వామ్యం కావాలని కోరింది. ఒక్క నిమిషంపాటు అమరావతి గురించి ఆలోచించి మీ సలహాలు.. సూచనలు పంపాలని కోరుతూ.. https://vil.ltd/APCRDA/c/Vision లింకును ప్రభుత్వం విడుదల చేసింది. దీనిని క్లిక్ చేయడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పౌరులు ఎవరైనా అమరావతి నిర్మాణంలో తమ ఆలోచనలను పంచుకోవచ్చని పేర్కొంది. ఇది భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే కార్యక్రమంగా భావించాలని కోరింది.
అంతేకాదు.. రాజధాని అంటే.. కేవలం ఒక ప్రాంతానికి పరిమితంకాదని.. ఒక రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికీ చెందిన ఆస్థిగా పేర్కొంది. దీనిని కాపాడుకునేందుకు, అభివృద్ధి చేసుకునేందుకు అనేక ఆలోచనలు ఉంటాయని.. ఇలా ప్రతి ఒక్కరి ఆలోచనను పరిగణనలోకి తీసుకుని మేలైన ఆలోచనలు, సలహాలను స్వీకరించనున్నట్టు సీఆర్ డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) కూడా తెలిపింది. దీనిలో సలహాలు.. సూచనలు ఇచ్చినవారి నుంచి మెరుగైన సలహాలు ఇచ్చిన వారిని ఎంపిక చేసి.. రాజధాని ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవనున్నట్టు సీఆర్ డీఏ పేర్కొంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో మీ ఆలోచనా శక్తీని పంచుకోండి.