hyderabadupdates.com movies హోంబలే ఫిలిమ్స్.. ముందుంది అసలు పండగ

హోంబలే ఫిలిమ్స్.. ముందుంది అసలు పండగ

పదేళ్ల ముందు ‘నిన్నిందాలే’ అనే ఫ్లాప్ మూవీతో ప్రొడక్షన్లోకి అడుగు పెట్టిన సంస్థ హోంబలే ఫిలిమ్స్. పునీత్ రాజ్ కుమార్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు జయంత్ సి.పరాన్జీ రూపొందించిన చిత్రమిది. తొలి సినిమా సక్సెస్ కాకపోతే నిర్మాణ సంస్థ నిలబడ్డం అంత తేలిక కాదు. కానీ హోంబలే మాత్రం పదేళ్లు తిరిగే సరికి దేశంలోనే అతి పెద్ద ప్రొడక్షన్ హౌస్‌ల్లో ఒకటిగా ఎదిగింది. ‘కేజీఎఫ్: చాప్టర్-1’తో ఆ సంస్థ రాత మారిపోయింది. ఆ తర్వాత కేజీఎఫ్-2, కాంతార, సలార్, మహావతార నరసింహా లాంటి బ్లాక్ బస్టర్లతో హోంబలే సంస్థ ఇండియాలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్‌గా మారింది.

హోంబలే అదృష్టం ఎలాంటిదంటే తాను ప్రొడ్యూస్ చేయకపోయినా, మధ్యలో టేకప్ చేసిన సినిమా అయిన ‘మహావతార నరసింహ’తోనూ సంచలన విజయాన్నందుకుంది. ఇప్పుడు ‘కాంతార: చాప్టర్-1’ రేపుతున్న సంచలనం గురించి తెలిసిందే.

ఐతే హోంబలే విజృంభణ ఇంతటితో అయిపోవట్లేదు. ముందుంది అసలు పండగ. ఆ సంస్థ నుంచి మరిన్ని మెగా మూవీస్ రాబోతున్నాయి. హోంబలేను నిలబెట్టిన ప్రశాంత్ నీల్‌.. అదే సంస్థలో సలార్-2, కేజీఎఫ్-3 చేయబోతున్నాడు. వచ్చే కొన్నేళ్లలో అవి ఒకదాని తర్వాత ఒకటి సెట్స్ మీదికి వెళ్తాయి. ఇంకోవైపు ‘మహావతార’ సిరీస్‌లో భాగంగా పరశురామ, కల్కి లాంటి సినిమాలు వరుసగా రాబోతున్నాయి.

ఇవి కాక వివిధ భాషల్లో టాప్ హీరోలతో క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టింది హోంబలే. ప్రభాస్‌తో ఆ సంస్థకు మరో సినిమా కమిట్మెంట్ ఉంది. పృథ్వీరాజ్ సుకుమారన్‌తో ‘టైసన్’ అనే మెగా మూవీ చేయబోతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌తోనూ హోంబలే ఒక సినిమా చేయనుంది. ఇక సొంత భాషలో రక్షిత్ శెట్టితో ‘రిచర్డ్ ఆంటోనీ’ అనే భారీ సినిమా తీస్తోంది. ఇంకా కాంతార: చాప్టర్-2 కూడా చేయాల్సి ఉంది. తమిళంలో సుధ కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగానూ ఒక సినిమా చేయబోతోంది. ఇలా రాబోయే ఐదారేళ్లలో పాన్ ఇండియా స్థాయిలో హోంబలే పేరు మార్మోగేలా భారీ చిత్రాలు రాబోతున్నాయి.

Related Post

Venkatesh–Trivikram’s “AK47” Begins Shoot in HyderabadVenkatesh–Trivikram’s “AK47” Begins Shoot in Hyderabad

The much-awaited collaboration between Venkatesh and director Trivikram has officially begun as their new film, titled “Aadarsha Kutumbam House No: 47 – AK47,” went on floors today in Hyderabad. The