ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న దారగానిపాడు గ్రామంలో జరిగిన దారుణ హత్య పై సీఎం చంద్రబాబు ఉదారంగా స్పందించారు. ఈ నెల 2న జరిగిన ఘటనలో లక్ష్మీనాయుడు అనే వ్యక్తిని టీడీపీకి చెందిన హరిశ్చంద్రప్రసాద్ అనే వ్యక్తి కారుతో గుద్దించి సినీ ఫక్కీలో దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అంతేకాదు.. ఈ ఘటనకు కులం రంగు కూడా పులుముకుంది.
ఈ నేపథ్యంలో దీపావళికి ముందు రోజు హుటాహుటిన ఈ ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు మంత్రులు నారాయణ, అనితలను క్షేత్రస్థాయికి పంపించి.. లక్ష్మీనాయుడి కుటుంబంతో మాట్లాడించారు. తాను కూడా స్వయంగా ఫోన్ చేసి ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. దోషులు ఎంతటి వారైన కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాదు.. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి.. ఈ కేసును త్వరగా విచారించేలా చర్యలు తీసుకుంటామని కూడా అప్పట్లోనే ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు.
తాజాగా ఈ విషయంపై దగ్గరలో ఉన్న మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడంపై దృష్టి పెట్టారు. వ్యవసాయ కుటుంబం కావడంతో దానికి సంబంధించి నసహకారం అందించాలని నిర్ణయించారు. ఒక దశలో లక్ష్మీనాయుడు భార్య సుజాతకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని భావించినా.. ఆమె వ్యవసాయం చేసుకునేందుకే మొగ్గు చూపినట్టు అధికారులు వివరించారు. దీంతో వ్యవసాయ భూమితో పాటు పరిహారం ప్రకటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లక్ష్మీనాయుడు సోదరులు పవన్, భార్గవ్‌లకు కూడా పరిహారం ప్రకటించారు.
పరిహారం ఇలా..
+ లక్ష్మీనాయుడి భార్య సుజాతకు: 4 ఎకరాల పొలం-5 లక్షల రూపాయలు.+ లక్ష్మీనాయుడి ఇద్దరు పిల్లలకు: 4 ఎకరాల పొలం-5 లక్షల రూపాయలు(ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తారు)+ లక్ష్మీనాయుడి సోదరుడు పవన్‌కు: 4 ఎకరాల పొలం-5 లక్షల రూపాయలు.+ లక్ష్మీనాయుడి మరో సోదరుడు భార్గవ్‌కు : 3 లక్షల రూపాయలు.