ఏదైనా పెద్ద పండుగ వచ్చిందంటే ఒకేసారి మూణ్నాలుగు సినిమాలు వచ్చి పడిపోతుంటాయి. సంక్రాంతికి ఈ రకమైన పోటీ ప్రతిసారీ ఉండేదే. ఆ తర్వాత ఎక్కువ సినిమాలు రిలీజయ్యే పండుగలు దసరా, దీపావళిలే. ఐతే ఈ ఏడాది దసరాకు వారం గ్యాప్‌లో ‘ఓజీ’, ‘కాంతార: చాప్టర్-1’ లాంటి భారీ చిత్రాలు రిలీజయ్యాయి. రెండూ మంచి ఫలితాన్నే అందుకున్నాయి. కానీ దీపావళికి మాత్రం మూడు రోజుల వ్యవధిలో నాలుగు సినిమాలు రిలీజైపోతున్నాయి.
వాటిలో ఏవి బాగా ఆడతాయి.. ఏవి దెబ్బ తింటాయి అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సాధారణంగా ఇలా బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఉన్నపుడు ఒకట్రెండు బాగా ఆడడం, మిగతావి దెబ్బ తినడం చూస్తుంటాం. కానీ గత ఏడాది దీపావళికి మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్‌లో ఎన్నడూ చూడని ఒక మ్యాజిక్ జరిగింది. పోటీలో ఉన్న మూడు చిత్రాలూ వాటి వాటి స్థాయిలో బాగా ఆడాయి.
కిరణ్ అబ్బవరం సినిమా ‘క’ పెద్ద హిట్టయింది. టాక్ ప్రకారం చూస్తే దుల్కర్ సల్మాన్ సినిమా ‘లక్కీ భాస్కర్’ బ్లాక్ బస్టర్ కావాల్సింది. ఐతే అది కూడా హిట్ అనిపించుకుంది. ఇక తమిళ అనువాదం ‘అమరన్’ ఎవ్వరూ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ అయింది. ఇలా మూడు సినిమాలూ బాగా ఆడి మోస్ట్ సక్సెస్ ఫుల్ దీపావళి సీజన్‌గా 2024 నిలిచింది. మరి ఈ ఏడాది కూడా అలాంటి మ్యాజిక్ వర్కవుట్ అవుతుందేమో అని సినీ పండితులు చూస్తున్నారు.
ఈసారి పోటీలో ఉన్న సినిమాలన్నీ కూడా ప్రామిసింగ్‌గానే కనిపిస్తుండడమే అందుక్కారణం. రేసులో ముందుగా రాబోతున్న ‘మిత్రమండలి’కి ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ కూడా వేస్తున్నారంటే టీం కాన్ఫిడెన్స్ అర్థం చేసుకోవచ్చు. జాతిరత్నాలు, మ్యాడ్ తరహాలో మ్యాడ్ ఫన్ ఉన్న సినిమాలా కనిపిస్తోందిది. ఇక సిద్ధు జొన్నలగడ్డ సినిమా ‘తెలుసు కదా’ ట్రైలర్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సిద్ధు ఇమేజ్‌కు తగ్గ రొమాంటిక్ ఎంటర్టైనర్లా కనిపిస్తోందీ చిత్రం. రిలీజ్ ముంగిట హైప్ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ.. కంటెంట్‌తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలమని టీం భావిస్తోంది.
ఇక ఆ సినిమా రిలీజయ్యే 18నే విడుదల కానున్న తమిళ అనువాదం ‘డ్యూడ్’ యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇది స్యూర్ షాట్ హిట్ అనే కాన్ఫిడెన్స్ టీంలో ఉంది. ఇక రేసులో చివరగా 19న రాబోతున్న కిరణ్ అబ్బవరం ‘కే ర్యాంప్’ యూత్‌కు కిక్కిచ్చే సినిమాలానే ఉంది. దీని ట్రైలర్ క్రేజీగా, ఫన్నీగా అనిపించింది. మొత్తానికి అన్ని సినిమాలూ మంచి ఓపెనింగ్సే తెచ్చుకునేలా ఉన్నాయి. మరి అన్నింటికీ టాక్ బాగుండి నాలుగు సినిమాలూ హిట్టయి 2024 మ్యాజిక్‌ను రిపీట్ చేస్తాయేమో చూడాలి.