తెలంగాణలో ఇతర పార్టీలకు అవకాశం లేదని.. 2034 వరకు తామే అధికారంలో ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. గతంలో పాలించిన చంద్రబాబు, రాజశేఖరరెడ్డి పాలనను తాము కొనసాగిస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు చేపట్టనున్నట్టు వివరించారు. గత కాంగ్రెస్ పాలనలో అనేక కేంద్ర సంస్థలు వచ్చాయని తెలిపారు. వాటి వల్లే రాష్ట్రానికి ప్రపంచస్థాయిలో పేరు వచ్చిందని తెలిపారు.
కేటీఆర్‌కు అది లేదు!
ఎస్సీల మేలు కోసం.. ఎన్నో సాహసాలు చేశామన్నారు. వర్గీకరణను కూడా పూర్తి చేశామని చెప్పారు. కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ నుంచి అనుమతి రావడం లేదన్నారు. కేసీఆర్ పెట్టిన ఏ పథకాన్నీ తాను రద్దు చేయలేదన్న ఆయన.. మరిన్ని కొత్తపథకాలు తీసుకొచ్చినట్టు చెప్పారు. ఇక, ఎన్నికల గురించి మాట్లాడుతూ.. వాస్తవానికి లెక్క ప్రకారం.. 2023లో ఎన్నికలు జరిగినందున 2028 డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు రావాలని.. కానీ రావని తెలిపారు. 2029 జూన్‌లో జమిలి ఎన్నికలు వస్తాయని.. అప్పుడు కూడా తామే విజయం దక్కించుకుంటామన్నారు. 2034 జూన్ వరకూ కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని రాసి పెట్టుకోవాలని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ కీలక నాయకుడు.. కేటీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ జాతకంలో `అధికారం` రేఖ లేదన్నారు. అయినా.. ఆయన తండ్రి కేసీఆర్.. ధ్రుతరాష్ట్రుడి మాదిరిగా ప్రయత్నిస్తున్నారని.. అందుకే.. వాస్తు.. దశ-దిశ అంటూ.. సచివాలయం మార్పులు చేశారని ఎద్దేవా చేశారు. ఎందుకూ పనికి రాని కట్టడాలు చేపట్టి ప్రజాధనం వెచ్చించారని చెప్పారు. కమాండ్ కంట్రోల్ రూమ్, ప్రగతి భవన్(ప్రస్తుతం ప్రజాభవన్), సచివాలయం వంటివి కట్టించారన్నారు.