hyderabadupdates.com movies 499 పరుగులు.. 73 బౌండరీలు… ఆల్ టైమ్ రికార్డ్!

499 పరుగులు.. 73 బౌండరీలు… ఆల్ టైమ్ రికార్డ్!

వాంఖడే స్టేడియంలో జరిగిన రెండో సెమీఫైనల్‌లో టీమ్ ఇండియా విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఇంగ్లాండ్‌పై 7 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై ఇరు జట్లు కలిసి ఏకంగా 499 పరుగులు రాబట్టడం విశేషం. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ చివరి వరకు పోరాడినా, భారత బౌలర్ల క్రమశిక్షణ ముందు తలవంచక తప్పలేదు. ఈ విజయంతో డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో భారత్ మరోసారి టైటిల్ పోరుకు సిద్ధమైంది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ సంజూ శాంసన్ కేవలం 42 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 89 పరుగులు చేసి టీమ్‌కు బలమైన పునాది వేశాడు. మిడిల్ ఆర్డర్‌లో శివం దూబే (43), ఇషాన్ కిషన్ (39) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. చివర్లో హార్దిక్ పాండ్యా (27), తిలక్ వర్మ (21) ధాటిగా ఆడటంతో భారత్ టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో రికార్డు స్థాయి స్కోరును నమోదు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, విల్ జాక్స్ చెరో రెండు వికెట్లు తీశారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసి స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఇంగ్లాండ్ బ్యాటర్ జేకబ్ బెథెల్ 48 బంతుల్లోనే 105 పరుగులతో అద్భుత సెంచరీ బాదినా ఫలితం లేకుండా పోయింది. విల్ జాక్స్ (35), జోస్ బట్లర్ (25) రాణించినా మిగతా వారు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం ఆ జట్టుపై ఒత్తిడి పెంచింది. ఫిలిప్ సాల్ట్ (5), హ్యారీ బ్రూక్ (7) త్వరగా నిష్క్రమించడం భారత్‌కు కలిసొచ్చిన అంశం.

ఈ మ్యాచ్‌లో బౌండరీల సునామీ కురిసింది. మొత్తం 73 బౌండరీలు (39 ఫోర్లు, 34 సిక్సర్లు) నమోదయ్యాయి. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ఇన్ని ఫోర్లు, సిక్సర్లు రావడం ఇదే మొదటిసారి. గతంలో 2016లో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా మ్యాచ్‌లో నమోదైన 61 బౌండరీల రికార్డును ఈ మ్యాచ్ తుడిచిపెట్టేసింది. వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు పూర్తిస్థాయిలో సహకరించడంతో బౌలర్లకు చుక్కలు కనిపించాయి. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 64 పరుగులు ఇవ్వడంతో పిచ్ పరిస్థితిని తెలియజేస్తోంది.

ఇంతటి పరుగుల విధ్వంసంలోనూ జస్ప్రీత్ బుమ్రా తనదైన ముద్ర వేశాడు. బ్యాటర్లు చెలరేగిపోతున్న సమయంలో బుమ్రా వేసిన స్పెల్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. తన 4 ఓవర్లలో కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక కీలక వికెట్ తీశాడు. చివర్లో హార్దిక్ పాండ్యా (2/38) కూడా కచ్చితమైన యార్కర్లతో ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేశాడు. చివరి ఓవర్లో శివం దూబే మూడు సిక్సర్లు ఇచ్చి 22 పరుగులు సమర్పించుకున్నా, అప్పటికే మ్యాచ్ భారత్ వశమైంది. బుమ్రా, హార్దిక్ బౌలింగ్  భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించింది. సెమీస్‌లో ఈ గెలుపుతో భారత్ ఇప్పుడు అహ్మదాబాద్‌లో జరగనున్న ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. సంజూ శాంసన్ తన అద్భుత బ్యాటింగ్‌కు గాను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు.

Related Post