మంత్రి నారా లోకేష్ కు కర్ణాటకలోని పలువురు మంత్రులకు మధ్య ఆసక్తికర చర్చ, వ్యాఖ్యలు తెర మీదకు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం తమ పెట్టుబడులను లాగేసుకుంటోందన్నది కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే చెబుతున్న మాట. దీనికి తాజాగా ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా నర్మగర్భంగా వ్యాఖ్యలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున రాయితీలు ఇస్తోందని, అందుకే తమ పరిశ్రమలు పోతున్నా యని అంటున్నారు. వాస్తవానికి గత ఏడాది జరిగిన చర్చల్లో గూగుల్ ఏఐ డేటా కేంద్రం బెంగళూరుకు వెళ్లాల్సి ఉంది.
ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. ఇదే సమయంలో మంత్రి నారా లోకేష్ విషయం తెలుసుకుని నేరుగా అమెరికాకు వెళ్లి వారితో చర్చించారు. ఏపీకి వచ్చేలా గూగుల్ ను ఒప్పించారు. విశాఖలో డేటా కేంద్రం ఏర్పాటు చేసేందుకు వీలుగా ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఈ క్రమంలో భారీ రాయితీలు ప్రకటించారు. సుమారు 22 వేల కోట్ల రూపాయల పైగా రాయితీలను ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కర్ణాటక మంత్రులు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రాల మధ్య విభేదాలు పెంచుతాయా లేకపోతే పోటీని పెంచుతాయా అనేది చూడాలి.
అయితే అవకాశం ఉన్న ప్రతి చోట దానిని వినియోగించుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కర్ణాటక నుంచి వెళ్ళిపోతామని చెబుతున్న కంపెనీలను ఆహ్వానించే ప్రయత్నంలో ఉన్న మాట వాస్తవం. ఇటీవల ప్రైవేటు కంపెనీ బెంగళూరులో రోడ్లు బాగోలేదని తాను వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నామని చెప్పినప్పుడు మంత్రి నారా లోకేష్ స్పందించి.. ఏపీకి వచ్చేయాలని అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. విశాఖలో ఏర్పాటు చేసుకునేందుకు భూములు కూడా ఇస్తామని రాయితీలు ప్రకటిస్తామని చెప్పారు.
ఇది అప్పట్లో వివాదమైన విషయం తెలిసిందే. మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం కాచుకుని కూర్చుందని వ్యాఖ్యానించారు. నిజానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా పెట్టుబడులు వస్తాయి అంటే ఆహ్వానించడంలో తప్పేమీ లేదు. తెలంగాణ కూడా ఇలానే వ్యవహరిస్తుంది. కానీ, ఏపీ ప్రభుత్వం పై మాత్రం కర్ణాటక అక్కసు వెళ్లగక్కుతోందన్నది రాజకీయంగా జరుగుతున్న చర్చ. ముందు ముందు ఇది ఎటు దారితీస్తుందో చూడాలి. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ను కర్ణాటక మంత్రులు టార్గెట్ చేయడం ఆశ్చర్యకరంగా ఉంది.