hyderabadupdates.com Gallery PM Narendra Modi: ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధనకు ఆంధ్రప్రదేశ్ కీలకం – ప్రధాని మోదీ

PM Narendra Modi: ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధనకు ఆంధ్రప్రదేశ్ కీలకం – ప్రధాని మోదీ

PM Narendra Modi: ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధనకు ఆంధ్రప్రదేశ్ కీలకం – ప్రధాని మోదీ post thumbnail image

Narendra Modi : ఆత్మగౌరవం, సంస్కృతికి నిలయంగా ఆంధ్రప్రదేశ్‌ ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కర్నూలు శివారులోని నన్నూరు వద్ద ‘సూపర్‌ జీఎస్టీ- సూపర్‌ సేవింగ్స్‌’ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగసభకు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan), ఐటీ మంత్రి నారా లోకేశ్‌ తదితరులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిర్మించిన, నిర్మించబోతున్న రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
PM Narendra Modi Key Comments
ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రధాని మోదీ (Narendra Modi) మాట్లాడుతూ… ‘‘సైన్స్‌, ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఉంది. ఏపీలో అనంత అవకాశాలతో పాటు యువతకు అపార శక్తి ఉంది. అహోబిలం నర్సింహస్వామి, మహానంది ఈశ్వరుడికి నమస్కరిస్తున్నా. మంత్రాలయం రాఘవేంద్రస్వామి అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నా. జ్యోతిర్లింగం సోమనాథుడి నేల అయిన గుజరాత్‌లో నేను జన్మించాను. విశ్వనాథుడి భూమి అయిన కాశీకి సేవ చేసే అవకాశం లభించింది. ఇవాళ శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆశీస్సులు పొందాను.
చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ (Deputy CM Pawan Kalyan) రూపంలో ఏపీకి శక్తిమంతమైన నాయకత్వం ఉంది. ఏపీకి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఉంది. 16 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఆధ్వర్యంలో రాష్ట్రం అపూర్వ ప్రగతి సాధిస్తోంది. దిల్లీ, అమరావతి వేగంగా అభివృద్ధి పథంలో సాగుతున్నాయి. 2047 నాటికి మన దేశం.. వికసిత్‌ భారత్‌గా మారుతుంది. 21వ శతాబ్దం.. 140 కోట్ల భారతీయుల శతాబ్దం’’ అని ప్రధాని మోదీ అన్నారు.
‘‘ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో కనెక్టివిటీ బలోపేతం అవుతుంది. ప్రాజెక్టులతో పరిశ్రమలకు ఊతంతో పాటు జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఇంధన భద్రత కీలకం. ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టులతో దేశం ఇంధన సామర్థ్యం పెరుగుతుంది. గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌ ద్వారా సబ్‌ సీ గేట్‌వేగా ఏపీ మారుతుంది. ఈ ప్రాజెక్టు విశాఖను ఏఐ, కనెక్టివిటీ హబ్‌గా మారుస్తుంది. దీని ద్వారా భారత్‌తో పాటు యావత్‌ ప్రపంచానికి సేవలు అందుతాయి. భారత్‌ అభివృద్ధికి ఏపీ అభివృద్ధి చాలా అవసరం. అలాగే ఏపీ అభివృద్ధికి.. రాయలసీమ అభివృద్ధి అంతే అవసరం. ఈ ప్రాజెక్టులు రాయలసీమలోని ప్రతి జిల్లాలో ఉద్యోగాలు సృష్టిస్తాయి.
రాయలసీమ ప్రగతికి సరికొత్త ద్వారాలు తెరిపిస్తాయి. ప్రాజెక్టులతో పారిశ్రామిక అభివృద్ధి మరింత వేగవంతమవుతుంది. ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లతో ఉపాధి అవకాశాలు పెరిగాయి. భారత్‌ను 21వ శతాబ్దపు తయారీ కేంద్రంగా ప్రపంచం చూస్తోంది. ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధనకు ఆంధ్రప్రదేశ్ కీలకంగా మారనుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఏపీ సామర్థ్యాన్ని విస్మరించాయి. దేశాన్ని ముందుకు నడిపించే శక్తి ఏపీకి ఉంది. ఎన్‌డీఏ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖచిత్రం మారుతోంది’’ అని ప్రధాని అన్నారు.
సూపర్‌ సేవింగ్స్‌ ప్రారంభం మాత్రమే – సీఎం చంద్రబాబు
మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అని ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. కర్నూలు శివారులోని నన్నూరు వద్ద ‘సూపర్‌ జీఎస్టీ- సూపర్‌ సేవింగ్స్‌’ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగసభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan), నారా లోకేశ్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లాభం పొందారన్నారు.
‘‘సూపర్‌ సేవింగ్స్‌ ప్రారంభం మాత్రమే.. రాబోయే రోజుల్లో మరిన్ని ఉంటాయి. 25 ఏళ్లుగా ప్రజా సేవలో సీఎంగా, ప్రధానిగా మోదీ ఉన్నారు. 21వ శతాబ్దం మోదీకి చెందుతుందనడంలో సందేహం లేదు. సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడు ప్రధాని మోదీ. అలాంటి నాయకుడిని పొందడం.. దేశం ఎంతో అదృష్టం చేసుకుంది. చాలా మంది ప్రధానులతో పనిచేసినా.. మోదీ (Narendra Modi) వంటి నాయకుడిని చూడలేదు. ఎలాంటి విశ్రాంతి లేకుండా నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు. 2047 నాటికి ప్రపంచంలో భారత్‌ అగ్రస్థానంలో నిలుస్తుంది. మోదీ సంకల్పంతో 11వ స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరాం. ఆపరేషన్‌ సిందూర్‌.. మన సైనిక బలం నిరూపించింది. మాటలతో కాదు.. చేతలతో చూపించే వ్యక్తి ప్రధాని మోదీ.
సూపర్‌ జీఎస్టీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రమంతా ఇప్పటికే 98వేల ఈవెంట్లు నిర్వహించాం. జీఎస్టీ (GST) తగ్గింపుతో 99శాతం వస్తువులు 5శాతం లోపు పరిధిలోకి వచ్చాయి. డబుల్ ఇంజిన్‌ సర్కార్‌తో మన రాష్ట్రానికి డబుల్‌ బెనిఫిట్‌ వచ్చింది. సూపర్‌ సిక్స్‌ పథకాలు, సూపర్‌ జీఎస్టీతో ప్రజలకు సూపర్‌ సేవింగ్స్‌ అందించాయి. మెగా డీఎస్సీ, పీఎం కిసాన్‌ అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, తల్లికి వందనం, దీపం-2, పింఛన్ల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలతో సూపర్‌ సిక్స్‌ని సూపర్‌ హిట్‌ చేశాం’’ అని చంద్రబాబు అన్నారు.
ఏపీలో కూటమి 15 ఏళ్లు బలంగా ఉండాలి – డిప్యూటీ సీఎం పవన్‌
ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) ఒక కర్మయోగి, ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా పనిచేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ‘సూపర్‌ జీఎస్టీ- సూపర్‌ సేవింగ్స్‌’ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. ‘‘ప్రధాని మోదీ దేశాన్ని మాత్రమే కాదు.. రెండు తరాలను నడుపుతున్నారు. దేశం తలెత్తి చూసే విధంగా ఆత్మనిర్భర్‌ భారత్‌ తీసుకువచ్చారు. దేశ జెండా ఎంత పౌరుషంగా ఉంటుందో.. అలాగే దేశ పటాన్ని ప్రపంచపటంలో నిలబెట్టారు. కూటమి 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలి. ఇబ్బందులు ఉన్నా.. ఏమున్నా తట్టుకుని నిలబడాలి. ఒక తరం కోసం ఆలోచించే నాయకులు సీఎం చంద్రబాబు. ప్రధాని, సీఎం నాయకత్వంలో అందరం సమష్టిగా పనిచేస్తాం. వచ్చే తరం ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్తాం’’ అని పవన్‌ అన్నారు.
నమో అంటే విక్టరీ – మంత్రి లోకేష్
భారత్‌ను తిరుగులేని శక్తిగా ప్రధాని మోదీ మారుస్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. ‘సూపర్ జీఎస్టీ (GST) – సూపర్ సేవింగ్’ బహిరంగసభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… బ్రిటీష్‌ వారిని గడగడలాడించిన ఉయ్యాలవాడ పుట్టిన నేల అని… కర్నూలు ప్రజల రాజసం కొండారెడ్డి బురుజు అని చెప్పుకొచ్చారు. మన నమో అంటే విక్టరీ.. ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే అని అన్నారు. గుజరాత్‌ సీఎంగా.. దేశ ప్రధానిగా 25 ఏళ్లు పూర్తి చేస్తుకున్నారని తెలిపారు. దేశాన్ని సూపర్‌ పవర్‌గా మార్చిన ఘనత మోదీది అంటూ మంత్రి కొనియాడారు. మోదీ కొట్టిన దెబ్బకు పాక్‌ దిమ్మ తిరిగిందన్నారు. ట్రాంప్‌ టారిఫ్స్‌తో పలు దేశాలు వణికినా మోదీ బెదరలేదని అన్నారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు సూపర్‌ సేవింగ్‌ అయ్యిందన్నారు.
పేద ప్రజల చిరునవ్వే మోదీకి పండుగన్నారు. దేశాన్ని సూపర్‌ పవర్‌గా మార్చిన ఘనత మోదీదే అని వెల్లడించారు. జీఎస్టీ తగ్గింపుతో రూ.8వేల కోట్ల ఆదాయం కోల్పోతామని చెప్పినా.. పేదలకు మంచి జరుగుతుందని సీఎం అన్నారని తెలిపారు. డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ కేంద్రంలో, రాష్ట్రంలో ఉందన్నారు. పారిశ్రామిక ప్రాజెక్టులు, రైల్వే, హైవే ప్రాజెక్టులు ఏపీకి వచ్చాయని చెప్పారు. భారత్ 4వ ఆర్ధిక వ్యవస్థగా ఎదగడానికి కారణం ప్రధాని మోదీనే అని అంటూ ప్రధానిపై మంత్రి లోకేష్ ప్రశంసల వర్షం కురిపించారు.
ఏపీలో పర్యటించడం ఎంతో ఆనందంగా ఉంది – ప్రధాని మోదీ
ఏపీలో పర్యటించడం ఎంతో ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పరిశ్రమలను బలోపేతం చేసి… పౌరులను శక్తిమంతం చేసేలా అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కనెక్టివిటీని పెంచే కార్యక్రమంలో పాల్గొనడం గర్వకారణమన్నారు.
‘‘శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆశీర్వాదం పొందడం అదృష్టంగా భావిస్తున్నా. ఏపీ స్వాభిమాన సంస్కృతి భూమి… విజ్ఞానశాస్త్రం… ఆవిష్కరణల కేంద్రం కూడా. స్వచ్ఛశక్తి నుంచి సంపూర్ణ శక్తి ఉత్పత్తి వరకు భారత్‌ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా మల్టీమోడల్‌ మౌలిక వసతులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. గ్రామాల నుంచి నగరాలు, నగరాల నుంచి పోర్టుల వరకు కనెక్టివిటీపై దృష్టి పెట్టాం. భారత్‌, ఆంధ్రప్రదేశ్‌ వేగం, సామర్థ్యాన్ని ప్రపంచం చూస్తోంది’’ అని మోదీ పేర్కొన్నారు.
Also Read : PM Modi: శ్రీశైలం మల్లన్న సేవలో ప్రధాని మోదీ
The post PM Narendra Modi: ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధనకు ఆంధ్రప్రదేశ్ కీలకం – ప్రధాని మోదీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

క‌ల్వ‌కుంట్ల క‌విత‌పై కోమ‌టిరెడ్డి షాకింగ్ కామెంట్స్క‌ల్వ‌కుంట్ల క‌విత‌పై కోమ‌టిరెడ్డి షాకింగ్ కామెంట్స్

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా : రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మాజీ సీఎం కేసీఆర్ కూతురు, ఇటీవ‌లే త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత పై ఆస‌క్తిక‌ర