టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఉన్నంతగా సోషల్ మీడియాలో ఇంకెవ్వరూ యాక్టివ్‌గా ఉండరనే సంగతి అందరికీ తెలిసిందే. ఆ మాటకొస్తే ఇండియా మొత్తంలో కూడా తమన్‌లా సోషల్ మీడియాలో చురుగ్గా కనిపించరు. తన సినిమాలను అతను సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రమోట్ చేస్తాడు. ఫస్ట్ సింగిల్ రిలీజైన దగ్గర్నుంచి అతను సినిమాను భుజాల మీద మోస్తాడు. ఇక ఆఫ్ లైన్ ప్రమోషన్లలోనూ తమన్ చురుగ్గా ఉంటాడన్న సంగతి తెలిసిందే.
గత నెల ‘ఓజీ’ సినిమాను హీరో, దర్శకుడి కంటే తమనే ఎక్కువ ప్రమోట్ చేశాడన్న సంగతి తెలిసిందే. కానీ తన కొత్త సినిమా ‘తెలుసు కదా’ విషయంలో మాత్రం తమన్ ఎందుకు వెనుకంజ వేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఈ సినిమాను కూడా ఒకప్పుడు బాగానే మోశాడు తమన్. ఈ చిత్రం నుంచి ‘మల్లిక గంద’ పాట రిలీజైనపుడు తమన్ చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. కానీ సినిమా రిలీజ్ టైంకి తమన్ ఉన్నట్లుండి సైలెంట్ అయిపోయాడు. అసలీ మూవీ రిలీజవుతున్న సంగతే పట్టనట్లు ఉంటున్నాడు.
‘తెలుసు కదా’కు సంబంధించి నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా పెట్టిన ఒక పోస్టును రీట్వీట్ చేయడం తప్పితే.. దాని గురించి ఏమీ మాట్లాడలేదు తమన్. మామూలుగా తాను సంగీతం అందించిన సినిమాల ప్రి రిలీజ్ ఈవెంట్లలో తమన్ చేసే సందడే వేరుగా ఉంటుంది. కానీ ‘తెలుసు కదా’ ఈవెంట్‌కు మాత్రం అతను రాలేదు. ప్రెస్ మీట్లలో కూడా పాల్గొనలేదు.
ఇక సోషల్ మీడియాలోనూ ఎలాగూ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయట్లేదు. తమన్ మనసుపెట్టి చేసిన సినిమాలాగే కనిపిస్తున్నా.. తన పాటలు, నేపథ్య సంగీతానికి మంచి స్పందన వస్తున్నా.. తమన్ ఎందుకు మౌనం వహిస్తున్నాడన్నది తెలియడం లేదు. మరి దర్శక నిర్మాతలతో ఏమైనా విభేదాలు తలెత్తాయా? దీని గురించి తమన్ తర్వాత ఎప్పుడైనా ఓపెనవుతాడేమో చూడాలి.