ప్రజలను పట్టి పీడించిన ఆ రాక్షసుడిని(వైసీపీ అధినేత జగన్) ప్రజలే గత ఎన్నికల్లో మట్టికరిపించారని సీఎం చంద్రబాబు అన్నారు. కూటమికి దిగ్విజయం కట్టబెట్టారని తెలిపారు. అందుకే.. రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్రంలో వైకుంఠపాళి రాజకీయాలకు ప్రజలు చెక్ పెట్టాలన్నారు. గుజరాత్‌లో ఒకే ప్రభుత్వం ఉండడంతో అక్కడ అభివృద్ధి సాకారం అవుతోందన్నారు. అనేక పెట్టుబడులు వచ్చాయన్నారు. అదేవిధంగా ఏపీలోనూ ఒకే ప్రభుత్వం కొనసాగితే.. పెట్టుబడులు సాకారం అవుతాయని.. రాష్ట్రం డెవలప్ అవుతుందని తెలిపారు.
దీపావళిని పురస్కరించుకుని విజయవాడలోని పున్నమిఘాట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికిపెట్టుబడులురావడం శుభసూచకమన్నారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం ఉందని, అందుకే ఇటీవల విశాఖలో గూగుల్ ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని తెలిపారు. గత 16 మాసాల్లో పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. ఇప్పుడు 15 బిలియన్ డాలర్లను గూగుల్ తీసుకువస్తోందని తెలిపారు. అమరావతిని వచ్చే మూడేళ్లలో 60 వేల కోట్ల రూపాయలతో అన్ని విధాలా అభివృద్ది చేయనున్నట్టు చెప్పారు.
“2019-24 మధ్య ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయన రాష్ట్రాన్ని పట్టిపీడించాడు. పెట్టుబడి దారులను తరిమి కొట్టాడు. ప్రజల గొంతు నొక్కాడు. జైళ్లలో పెట్టించాడు. స్వేచ్ఛ లేకుండా చేశాడు. అలాంటి రాక్షసుడిని గత ఎన్నికల్లో ప్రజలు ఓడించారు. ఇప్పుడు అభివృద్ధి ఫలాలు చేరువ అవుతున్నాయి. వీటిని కొనసాగించాలంటే రాష్ట్రంలో వైకుంఠ పాళీ రాజకీయాలు వద్దు. అలా అయితే.. మళ్లీ రాష్ట్రం నాశనం అవుతుంది.“ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రతి కుటుంబానికీ నెలకు రూ.15 వేల చొప్పున మేలు జరుగుతోందన్నారు. దీనిని అందరూ ఎంజాయ్ చేయాలని సూచించారు. దీపావళినిపురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి.. దీనిని హరిత దీపావళిగా నిర్వహించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.