జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ దూకుడు పెంచింది. ముఖ్యంగా రెండు కీలక అంశాలను ప్రాతిపదికగా చేసుకుని మాజీ మంత్రి కేటీఆర్.. తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రచారం అంటే.. ఆయన నేరుగా ప్రజల మధ్యకు రాకపోయినా.. తాను ఎక్కడున్నా.. కామెంట్లు చేస్తున్నారు. తద్వారా.. ప్రభుత్వ తీరు.. ముఖ్యంగా హైడ్రాను ప్రజలకు పదే పదే గుర్తు చేయడం వంటివి రాజకీయంగా చర్చకు వస్తున్నాయి. ఆదివారం పండుగ పూట కూడా కేటీఆర్ వదిలి పెట్టలేదు. `హైడ్రా` పేరుతో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇదేసమయంలో పొరుగు రాష్ట్రం ఏపీ పెట్టుబడులకు సానుకూలంగా మారుతున్న నేపథ్యంలో తెలంగాణ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. ఏపీ పేరును ఎత్తకుండానే విమర్శలు గుప్పించారు. పెట్టుబడి దారులకు ఒకప్పుడు తాము గొడుగులు పట్టుకుని తీసుకువచ్చామని.. కానీ, ఇప్పుడు తుపాకులతో బెదిరింపులకు గురి చేస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించడం ద్వారా రేవంత్ రెడ్డి సర్కారు పెట్టుబడి దారులను బెదిరిస్తోందన్న వాదనను బలంగా ఆయన వినిపించే ప్రయత్నంచేశారు. అంతేకాదు.. పెట్టుబడుల రాక ఎక్కడుందన్న ప్రశ్నకు ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదని నిలదీశారు.
ఇక, హైడ్రా విషయాన్ని బీఆర్ ఎస్ నాయకులు బలంగా ప్రజల మధ్యకు తీసుకువెళ్తున్నారు. దీనిలో ప్రధానంగా మంత్రులు.. సహా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇళ్లు ఎక్కడున్నాయో.. చెప్పాలంటూ.. బహిరంగ చర్చకు దిగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వారి ఇళ్లన్నీ చెరువులను ఆక్రమించే కట్టారని.. కానీ, హైడ్రా ఇప్పటి వరకు వాటి జోలికి పోలేదన్నారు. అదేసామాన్యులు కుంట భూమిలో పాక వేసుకుంటే కూల్చేస్తున్నారని.. ఇలాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునివ్వడం ద్వారా జూబ్లీహిల్స్ పోరులో తమ ప్రాధాన్యాన్ని ఆయన స్పష్టం చేస్తూనే ఉన్నారు.
గతంలోనూ హైడ్రాను ప్రధానంగా ఎన్నికల వేల ప్రచారంలోకి తీసుకువచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత.. తొలి రెండు రోజులు హైడ్రా కేంద్రంగానే బీఆర్ ఎస్ రాజకీయాలు చేసింది. మరోవైపు.. ప్రభుత్వం మాత్రం హైడ్రాపై నోరు మెదపడం లేదు. ఎక్కడా పన్నెత్తు మాట కూడా అనడం లేదు. గత పాలనలోని తప్పులను మాత్రమే సీఎంరేవంత్ రెడ్డి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అంతకుమించి కాంగ్రెస్ నేతలు స్పందించడం లేదు. తాజాగా బీఆర్ ఎస్ ఇటు మంత్రుల మధ్య కీచులాట, హైడ్రా, సీఎం సోదరుడి నివాసం, మంత్రుల ఇళ్ల పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.