దేశ రాజధాని ఢిల్లీలో ఎంపీలకు కేటాయించిన ఫ్లాట్ల సముదాయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. చిన్నారులు టపాసులు కాలుస్తుండగా ఫర్నీచర్ కి మంటలు అంటుకోవడంతో ప్రమాదం సంభవించినట్లు సమాచారం. బీడీ మార్గ్‌లోని ఈ అపార్ట్‌మెంట్… పార్లమెంట్ హౌస్‌కు కేవలం 200 మీటర్ల దూరంలో ఉంది. అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు.
బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్‌లో మూడు అంతస్తులు దగ్ధమయ్యాయి. ప్రాణ నష్టం తప్పింది. చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. అగ్ని ప్రమాదం ఫోన్ కాల్ తర్వాత 40 నిమిషాలకు అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నట్లు తెలిసింది. ఆలస్యంగా రావడంతో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని స్థానికులు అంటున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ లేదా బాణాసంచా కారణమని స్థానికులు చెబుతున్నారు. పార్కింగ్ ఏరియాలో ఫర్నిచర్ ఉంచడం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని అపార్ట్‌మెంట్ వాసులు అంటున్నారు. సీపీడబ్ల్యూడి నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అపార్ట్‌మెంట్ వాసుల ఆరోపిస్తున్నారు.
అమృత్‌సర్-సహర్సా గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం
అమృత్‌సర్-సహర్సా గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. పంజాబ్‌లోని అమృతసర్ నగరం నుంచి బయలుదేరిన రైల్లో శిర్హింద్ స్టేషన్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జీ-19 బోగీలో తొలుత పొగలు రావడాన్ని జీఆర్‌పీ అధికారి ఒకరు గుర్తించారు. ఈ క్రమంలో ఓ ప్యాసెంజర్ బోగీలోని చెయిన్ లాగి రైలును ఆపేశారు. ఆ తరువాత ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించేశారు. ఈ లోపు మంటల్లో చిక్కుకుని బోగీ మొత్తం తగలబడిపోయింది. సమీపంలోని మరో రెండు బోగీలకు కూడా మంటలు వ్యాపించడంతో అవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. మూడు కోచ్‌లను రైలు నుంచి వేరు చేసిన సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటలు ఆర్పేశారు.
ఈ ఘటనలో ఒక వ్యక్తికి గాయమైందని రైల్వే బోర్డు ప్రకటించింది. కాలిన గాయాలైన మహిళను (32) ఫతేగఢ్ సాహిబ్‌లోని సివిల్ ఆసుపత్రికి తరలించినట్టు శిర్హింద్ జీఆర్‌బీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రతన్ లాల్ తెలిపారు. మంటలను గుర్తించిన వెంటనే అధికారులు ప్రభావిత కోచ్‌లల్లోని ప్రయాణికులను ఇతర కోచ్‌లకు తరలించారని తెలిపారు. మరి కాసేపట్లో రైలు యథాతథంగా ప్రయాణాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. అయితే, అగ్నిప్రమాదానికి గల కారణ మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
మహారాష్ట్రలో లోయలో పడిన పికప్ వ్యాన్ ! ఎనిమిదిమంది మృతి !
మహారాష్ట్రలోని నందూర్బార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులను తీసుకెళ్తున్న పికప్ వాహనం లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. బాధితులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
మీడియాకు అందిన వివరాల ప్రకారం… పికప్ వాహనం అస్తంబ దేవి యాత్ర ముగించుకుని వస్తున్న భక్తులను తీసుకెళుతోంది. ఇంతలో ఘాట్ మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో, బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలను చేపట్టింది. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అస్తంబ దేవి యాత్రకు హాజరైన భక్తులు తమ గ్రామానికి తిరిగి వెళుతుండగా ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో బీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి. బోల్తా పడిన వాహనం కింద పలువురు చిక్కుకున్నారు. ప్రమాదానికి గల కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు.
The post Delhi: ఢిల్లీ ఎంపీల నివాస సముదాయంలో అగ్ని ప్రమాదం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Delhi: ఢిల్లీ ఎంపీల నివాస సముదాయంలో అగ్ని ప్రమాదం
Categories: