టాలీవుడ్లో అత్యంత డిమాండ్ ఉండే సీజన్ అయిన సంక్రాంతికి అంతిమంగా వచ్చే సినిమాలేవి.. రేసు నుంచి తప్పుకునేవి ఏవి అనే చర్చ ప్రతిసారీ ఉండేదే. ఈ విషయంలో చివరి వరకు సస్పెన్స్ నడుస్తూనే ఉంటుంది. కొన్ని చిత్రాలు మొదట్నుంచి పోటీలో ఉండి చివర్లో తప్పుకుంటూ ఉంటాయి. కొన్నేమో చివర్లో బెర్తు కన్ఫమ్ చేసుకుంటాయి. క్రేజీ సీజన్ కదా అని కర్చీఫ్ వేసి పెట్టడం.. చివరికి వీలు పడక కొన్ని చిత్రాలు పోటీ నుంచి తప్పుకోవడం చూస్తుంటాం.
రాబోయే సంక్రాంతికి మొదట్నుంచి పోటీలో ఉన్నవి మన శంకర వరప్రసాద్, అనగనగా ఒక రాజు సినిమాలు. వాటికి ‘రాజా సాబ్’ తోడైంది. వీటికి థియేటర్లు సర్దుబాటు చేయడమే చాలా కష్టం. ఇంతకుమించి ఛాన్స్ లేదనే భావించాలి. కానీ తమిళం నుంచి విజయ్ సినిమా ‘జననాయకుడు’, సూర్య మూవీ ‘కరుప్పు’ను కూడా సంక్రాంతికి తెలుగులోనూ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. వాటి కోసం కొన్ని థియేటర్లు కేటాయించడం కూడా కష్టంగా ఉంది. అలాంటిది తెలుగు నుంచి ఇంకో రెండు సినిమాలు సంక్రాంతి రిలీజ్ అంటూ పట్టుదలను ప్రదర్శిస్తున్నాయి.
అవే.. భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి. ఈ చిత్రాలను కూడా సంక్రాంతి టార్గెట్‌తోనే మొదలుపెట్టారు. కానీ వీటి షూటింగ్ ఆలస్యంగా మొదలుకావడం, మధ్యలో అప్‌డేట్స్ ఏవీ లేకపోవడంతో పోటీ నుంచి తప్పుకున్నాయని అనుకున్నారు. కానీ ఇటీవల రవితేజ సినిమా నుంచి సంక్రాంతి రిలీజ్ అంటూ లీక్స్ వచ్చాయి. తాజాగా శర్వా మూవీ నుంచి సంక్రాంతి విడుదల అంటూ అఫీషియలే పోస్టరే రిలీజ్ చేశారు.
కానీ ఇన్ని సినిమాలను ఒకేసారి రిలీజ్ చేయడం అన్నది అసాధ్యం. ఆల్రెడీ బెర్తులు కన్ఫమ్ చేసుకున్న సినిమాల్లో ఒకట్రెండు తప్పుకుంటే తమ చిత్రాలను బరిలోకి దించుతామని ఈ చిత్రాల మేకర్స్ భావిస్తుండొచ్చు. మరి చివరికి పోటీలో ఎవరుంటారు.. ఎవరు తప్పుకుంటారు అన్నది తేలడానికి ఇంకా కొన్ని రోజుల సమయం పట్టేలా ఉంది. థియేటర్ల బుకింగ్స్ మొదలయ్యాక స్పష్టత రావచ్చు.