రాజకీయాల్లో నాయకులు ఏ ఎండకు ఆ గొడుగు పడతారన్నది తెలిసిందే. అవకాశం-అవసరం అనే రెండు పట్టాలపైనే రాజకీయాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో గతానికి భిన్నంగా బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్.. పేదలు.. హైడ్రా బాధితులతో కలిసి తాజాగా దీపావళిని జరుపుకొన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో హైడ్రాను ప్రధాన అస్త్రంగా చేసుకున్న బీఆర్ ఎస్.. పేదల ఓటు బ్యాంకును తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కేటీఆర్.. గతానికి భిన్నంగా వ్యవహరించారన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
ఏం చేశారంటే..
గత కొన్నేళ్లుగా ఇంట్లోనే జరుపుకొంటున్న దీపావళిని తాజాగా మాజీ మంత్రి కేటీఆర్.. మాదాపూర్‌లోని సున్నం చెరువు ప్రాంతంలో పేదలు, హైడ్రా బాధితులతో కలిసి నిర్వహించారు. వారందరికీ తనే దీపావళి టపాసులను కొనిచ్చారు. ఈ సందర్భంగా వారితో కలిసి టపాసులు కాల్చారు. అనంతరం.. కేటీఆర్ మాట్లాడుతూ.. సున్నం చెరువు ప్రాంతంలో ఉండేదంతా పేదలేనని.. అయినా.. హైడ్రా మాత్రం తన కసి తీర్చుకుందని.. పేదల గూడును కూల్చేసిందని వ్యాఖ్యానించారు. కో ఆపరేటివ్ సొసైటీ హౌసింగ్ వాసులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నట్టు చెప్పారు.
హైడ్రా వల్ల అనేక మంది పేదలు రోడ్డున పడ్డారని కేటీఆర్ విమర్శించారు. పేదల ఇళ్లే హైడ్రాకు కనిపిస్తున్నాయన్న కేటీఆర్.. సీఎం రేవంత్ బంధువులు, మంత్రులు ఆక్రమించుకున్న చెరువులు.. భూములు హైడ్రాకు కనిపించడం లేదని విమర్శించారు. పేదలంతా కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యా నించారు. “మా సార్ ఎప్పుడొస్తడా.. మా కష్టాలు ఎప్పుడు తొలిగిపోతాయా?. అని పేదలు ఎదురు చూస్తున్నారు.“ త్వరలోనే కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని.. అప్పుడు పేదల కుటుంబాల్లో కొత్త దీపావళి కాంతులు విరజిమ్ముతాయని అన్నారు.
ఇప్పుడే కనిపించారా: కాంగ్రెస్
అయితే.. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పించారు. పేదల కుటుంబాలు కేటీఆర్‌కు ఇప్పుడే కనిపించాయా? అని కాంగ్రెస్ చీఫ్ మహేష్ గౌడ్ విమర్శించారు. గత ఏడాది కూడా హైడ్రా ఉందన్న ఆయన.. అప్పట్లో పేదలు కనిపించలేదా? అప్పట్లో దీపావళి వారి మధ్య జరుపుకోవాలని అనుకోలేదా? అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం.. కేటీఆర్, బీఆర్ ఎస్ నాయకులు నాటకాలు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. పేదలపై అంత ప్రేమ ఉంటే.. ఫామ్ హౌస్‌లో ఇళ్లు కట్టించి ఇవ్వాలని అన్నారు.